అఖిలపక్షం సై అంటే యుద్ధమేనా?

Update: 2016-09-29 10:39 GMT

పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాల ద్రుష్ట్యా భారత్ ఇప్పుడు చాలా కీలకమైన దశను ఎదుర్కొంటోంది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో.. భారత సైన్యం సరిహద్దులు దాటి.. ఉగ్రవాద శిబిరాలను మట్టుపెట్టడం కూడా తీవ్రమైన అంశంగా పరిగణన పొందుతోంది. ఇలాంటి సమయంలో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని అంతా అనుకుంటున్నారు.

రాజస్తాన్ గుజరాత్ సరిహద్దుల్లో పాకిస్తాన్ హద్దుల వద్దకు భారత్ పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే యుద్ధానికి సిద్ధమయ్యే రీతిలో వనరుల్ని సమీకరించుకుంటున్నట్లుగా తెలుస్తున్నది.

అదే సమయంలో దేశంలో అంతర్గతంగా ఎలాంటి అలజడి, వ్యతిరేకత రాకుండా చూసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన దాడులన్నీ.. సాక్షాత్తూ మనోహర్ పారికర్ ఆమోదంతోనే, ఆయన ఆదేశాల మేరకే జరిగినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 5 గంటల సమయంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. అన్ని పార్టీల ప్రతినిధుల్ని హాజరు కావాల్సిందిగా కోరుతోంది.

ఒకవేళ అఖిలపక్షం గనుక సై అన్నట్లయితే.. యుద్ధ భేరీలు మోగడం ఖాయం అని పలువురు అంచనా వేస్తున్నారు. యుద్ధం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితిని పాకిస్తానే కల్పించిందని... ఇలాంటి పరిస్థితిలో మిన్నకుండడం కూడా వెనక్కు తగ్గడం లాగే ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News