అంతరిక్షంలో ఇస్రో అద్భుత ప్రయోగం

Update: 2017-02-14 23:30 GMT

భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ మరో ఘనతను సాధించబోతోంది. విశ్వవ్యాప్తంగా ఇస్రో కీర్తి ఇనుమడించబోతోంది. ఇస్రో చేస్తున్న భారీ ప్రయోగానికి దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలో ప్రవేశ పెట్టబోతోంది. ప్రవేశపెట్టనుంది. వీటిలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి చెందిన 88 ఉపగ్రహాలు ఉండటం విశేషం. అంతరిక్షంలో నవశకానికి నాంది పలకబోతోంది. ఏకంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను ఒకే కక్ష్యలోకి ప్రవేశపెట్టడం చరిత్ర సృష్టించడమేనంటున్నారు శాస్త్రవేత్తలు.

నేటి ఉదయమే...

బుధవారం ఉదయం 9.07 నిమిషాలకు ఈ ప్రయోగం ప్రారంభమవుతుంది. పీఎస్ఎల్వీ - సీ 37 రాకెట్ ప్రయోగంపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 104 ఉపగ్రహాలను ఒకే వాహననౌక మోసపోవడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చాలా సంక్లిష్టమైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఒకే సారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన తర్వాత భూమికి ఆనుకునే ఉన్న శుక్ర, అంగారకగ్రహ యాత్రలపై ఇస్రో దృష్టి పెట్టనుంది. ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం కూడా సముఖత వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా ఇన్ని ఉపగ్రహాలను అంతరిక్షంలో ఒకే సారి పంపలేదు. 2014లో రష్యా 37ఉపగ్రహాలను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ద్వారా అంతరిక్షంలోకి పంపింది. ఇదే ఇప్పటి వరకూ ప్రపంచ రికార్డు.

అంగారక గ్రహం మీదకు...

మరోవైపు ఇస్రో ప్రపంచపటంలో భారత్ ను ఉత్తమ స్థానంలో నిలబెట్టేందుకు కూడా కృషి చేస్తుంది. 2021-2022 నాటికి అంగారక గ్రహం మీద రోబోను పంపేందుకు ఇస్రో ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కేంద్ర బడ్జెట్ లోనే అధికంగా నిధులు కేటాయించారు. మొత్తం మీద బుధవారం ఇస్రో చేస్తున్న ప్రయోగం విజయవంత మవుతుందని ఆశిద్దాం. శాస్త్రవేత్తలకు ఆల్ ది బెస్గ్ చెబుదాం.

Similar News