పాండవులు పనిచేస్తేనే వైసీపీకి విజయమా.... !!

Update: 2018-12-16 12:30 GMT

భారతంలో పంచ పాండవులు అంటే ఐక్యతకు, బలానికి సంకేతం. అలాగే విజయానికి కూడా సందేశం. కానీ రాజకీయ భారతంలో అయిదుగురు సమ ఉజ్జీలు ఉన్నారంటే అక్కడ జరిగేది కచ్చితంగా యుధ్ధమే. ఇపుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అదే జరుగుతోంది. ఇక్కడ వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే నరెష్ కుమార్ అగర్వాల్ తాజాగా వచ్చి చేరారు. జగన్ పాదయాత్రలో భాగంగా ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఆశావహుల జాబితా అయిదుకు చేరింది.

గ్రూపుల గోల.....

నరేష్ కుమార్ అగర్వాల్ కొత్త ఏం కాదు. గతంలో వైసీపీలో ఆయన ఉండేవారు. అయితే పార్టీలో వర్గ పోరు తట్టుకోలేక బయటకు వెళ్ళిపోయారు. 2004 ఎన్నికల్లో గెలిచి అప్పటికి దాదాపుగా పాతికేళ్ళుగా ఎగరని చోట కాంగ్రెస్ జెండాను నిలబెట్టిన ఘనత నరెష్ కుమార్ కి దక్కుతుంది. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో వైసీపీలోకి వచ్చి చేరారు. 2014లో ఇక్కడ కూడా టికెట్ రాకపోవడంతో ఆయన రాజకీయాలకు కొన్నాళ్ళు దూరంగా ఉంటూ వస్తున్నారు.

జనసేనలో చేరతారనుకున్నా.....

మధ్యలో తెలుగుదేశం, జనసేనలలో చేరుతారని ప్రచారం జరిగినా మళ్ళీ ఫ్యాన్ నీడకే వచ్చి చేరారు. దాంతో ఆయనకు టికెట్ ఇస్తారా అన్న సందేహం ప్రస్తుతం ఉన్న నాయకుల్లో కలుగుతోంది. అదే వారి కలవరానికి కారణమవుతోంది. ఇక, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఇచ్చాపురం ఆ పార్టీకి కంచుకోట. అటువంటి కోటను 2004 ఎన్నికల్లో నరెష్ అగర్వాల్ బద్దలు కొట్టారు. అయితే 2009, 2014 లోనూ కూడా ఇక్కడ టీడీపీయే విజయ భేరీ మోగించింది. మారిన రాజకీయ పరిస్థితులు వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నా పార్టీ అంతా ఒక్కటిగా ఉంటేనే విజయం తధ్యమని అంటున్నారు.

ముగ్గురూ ఒకే చోట....

వైసీపీకి ప్రస్తుతం ఇంచార్జిగా 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన పిరియా సాయిరాజు ఉన్నారు. ఆయనతో పాటు, 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన నర్తు రామారావు కూడా ఉన్నారు. రామారావు 2009 లో కాంగ్రెస్ తరఫున పోటీ పడి ఇదే సాయిరాజ్ చేతిలో ఓడిపోయారు. వీరిద్దరూ కాకుండా మరో ఇద్దరు నాయకులు కూడా వైసీపీ నుంచి ఛాన్స్ వస్తే పోటీకి రెడీ అంటున్నారట. వీరికి తోడు ఇపుడు నరెష్ అగర్వాల్ వచ్చారన్నమాట. గతంలో పార్టీలో ఉండడంతో పాటు, డేరింగ్ లీడర్ గా పేరున్న నరేష్ కుమార్ వైసీపీలోకి రావడంతో జొష్ బాగా కనిపిస్తోందని పార్టీ నాయకులు అంటున్నారు. పైగా ఆయనకు టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టిన ట్రాక్ రికార్డు కూడా ఉంది. దాంతో ఆయనకే టికెట్ ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. అయితే పార్టీలో వర్గ పోరు లేకుందా ఉంటే వైసీపీ ఇక్కడ గెలిచేందుకు అన్ని విధాలుగా అవకాశం ఉంటుందని అంటున్నారు.

Similar News