ఆ ఎమ్మెల్యే...అన్ని కోట్లు వదులుకున్నారా.... !!

Update: 2018-12-04 11:00 GMT

విశాఖ జిల్లాలో 2014 ఎన్నికల్లో వైసీపీకి మూడంటే మూడు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కాయి. మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉంటే మిత్రపక్షం బీజేపీతో కలుపుకుని టీడీపీ 12 సీట్లు సొంతం చేసుకుంది. విశాఖ సిటీలో ఒక్క సీటు వైసీపీకి రాకుండా పోతే రూరల్లో మాడుగుల తప్ప అన్నీ సైకిల్ పార్టీకే జై అన్నాయి. ఏజెన్సీ మాత్రం ఫ్యాన్ నీడన నిలించింది. అంతే కాదు అరకు ఎంపీ సీటు కూడా వైసీపీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా గెలిచిన తరువాత అరకు ఎంపీ వెంటనే అధికార పార్టీ టీడీపీ వైపు వెళ్ళిపోయారు. తరువాత కాలంలో అరకు ఎమంల్యే కిడారి సర్వేశ్వరరావు, ఆ వెనక పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా టీడీపీ కండువా కప్పేసుకున్నారు.

ఆయనొక్కడే మిగిలాడు....

ఇంత జరిగినా కూడా ఒకే ఒక్కడన్నట్లుగా మాడుగుల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాత్రం వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఆయన సైతం సైకిలెక్కేస్తారని ఎన్నో సార్లు ప్రచారం జరిగినా ఫ్యాన్ పార్టీనే నమ్ముకుని ఇంతవరకూ వచ్చారు. దీనిపై ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ అధికార పార్టీ తనను ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా తాను ఎక్కడా తగ్గలేదని చెప్పుకొచ్చారు. పార్టీ మారితే చాలంటూ ఏకంగా 30 కోట్ల రూపాయల ఆఫర్ కూడా ఇచ్చారని బూడి చెప్పడం విశేషం. అయినా తాను అధికారం వైపుగా అడుగులు వేయలేదని, వారి చూపించిన ఆఫర్ కి కూడా లొంగలేదని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే కావాలని 2004 నుంచి అనుకున్నానని, తన కలను నెరవేర్చింది మాత్రం వైఎస్ జగన్ అని, అందువల్లనే ఆయనతోనే ఉండిపోయాయని ఇక ముందు కూడా పార్టీకే తన జీవితం అంకితం అంటూ చెప్పుకొచ్చారు.

మళ్ళీ ఆయనేనా...?

నిజానికి మాడుగులలో బూడి ముత్యాలనాయుడుకు మంచి పేరు ఉంది. పిలిస్తే పలుకుతారని జనం భావిస్తారు. తన నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఆయన ఉంటారని కూడా చెబుతారు. ప్రజల కష్ట సుఖాలను పంచుకునే బూడి ముత్యాలనాయుడుకి విజయావకాశాలు కూడా అధికంగావే ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆయన ఆర్ధిక పరిస్థికి మాత్రం అంతగా అనుకూలంగా లేదంటున్నారు. గతసారి పోటీ చేసినపుడే ఆయన ఇబ్బందులు పడ్డారు. ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీకి దిగాలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. అయితే జగన్ ఆయన పట్ల మంచి సానుకూలంగా ఉన్నారని, పార్టీకి అంకితం అయిన బూడిని వదులుకోకుండా టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని పార్టీ నేతలకు సూచించారని అంటున్నారు. మొత్తానికి ప్రత్యర్ధి టీడీపీ అక్కడ అధికార బలంతో పాటు, ధన బలం కూడా ఈసారి చూపించే అవకాశం ఉన్న నేపధ్యంలో బూడికి వైసీపీ పూర్తి మద్దతుగా నిలిచి గెలిపించుకోవాలనుకుంటోంది. హోరా హోరీ పోరు సాగనున్న మాడుగులలో ఏం జరుగుతుందో చూడాలి.

Similar News