వైసీపీ: చేతులెత్తేసిన నాయకులు..?

Update: 2018-12-23 14:30 GMT

ఏపీ ప్ర‌ధాన విప‌క్షం వైసీపీలో నిర్వేదం క‌నిపిస్తోంది. గ‌త కొన్నాళ్లుగా అధినేత జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు పార్టీలో పెను ప్ర‌కంప‌న‌ల‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. ఇదే ఇప్ప‌టికీ నాయ‌కుల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు 'మ‌న‌కెందుకులే!' అనే రేంజ్‌కు వెళ్లిపోయింది. కేవ‌లం విజ‌య‌సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి ఒక‌రిద్ద‌రు నాయ‌కులు త‌ప్ప మిగిలిన వారు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. పైగా ఇత‌ర నాయ‌కులు బొత్స స‌త్యనారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వంటివారిపై టీడీపీ అనుకూల మీడియాలో వ్య‌తిరేక క‌థ‌నాలు వ‌స్తున్నా కూడా వాటిని ఖండించే నాయ‌కులు కూడా క‌రువవుతున్నారు. ఒక‌ప్పుడు వీరిద్ద‌రు ప్ర‌భుత్వ వ్య‌తిరేక కామెంట్లు కుమ్మ‌రించ‌డంలో ముందు వ‌రుస‌లో ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు పూర్తిగా సైలెంట్ అవ్వ‌డం వెన‌క కార‌ణాలు అంతుప‌ట్ట‌క‌పోయినా జ‌గ‌న్ స్వ‌యంగా వీరిద్ద‌రికి ప్రాధాన్య‌త త‌గ్గించేశార‌న్న గుస‌గుస‌లు పార్టీలోనే వినిపిస్తున్నాయి.

బాబు దూకుడు పెంచినా.....

ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాలే గ‌డువు ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌రోక్షంగా త‌ను రాష్ట్రం లో అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పై పెద్ద ఎత్తున డిజిట‌ల్ మీడియాలో ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు ''మీరే కావాలి.. మీరే రావాలి!'' త‌ర‌హ‌లో ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ సంగ‌తిని గ్ర‌హించి కూడా వైసీపీ నుంచి ఎలాంటి ప్ర‌య‌త్నాలూముందుకు సాగ‌డం లేదు. దీనిపై వైసీపీ సాను భూతి ప‌రులు ఆరా తీస్తే.. జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలితోనే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని పేర్లు రాయ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని సీనియ‌ర్ నాయ‌కులు మీడియా ముందు చెబుతున్నారు.

ఇష్టానుసారంగా మార్చివేస్తుండటంతో....

ఎన్నిక‌ల సమ‌యంలో కోరి జ‌గ‌న్ పార్టీని నిస్తేజం చేస్తున్నార‌ని అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను ఆయ‌న ఇష్టానుసారంగా మారుస్తుండ‌డం దీనిలో ప్ర‌ధాన భాగం అయితే.. కీల‌క నాయ‌కుల‌కు కూడా ఎలాంటి అధికారాలు లేకుండా అన్నీత‌న‌వ‌ద్దే పెట్టుకుని పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత చూద్దాం.. అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో సీనియర్లు కూడా ఇక‌, తాము ఏం చేసినా.. ఏం కొంప‌మునుగుతుందో అనే రేంజ్‌లో వెన‌క్కి త‌గ్గుతున్నారు. లేక‌పోయి ఉంటే.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ద్వంద్వ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాల‌ని వారిలోనూ ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. కానీ, మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడితే.. జ‌గ‌న్ ఎక్క‌డ ఆగ్ర‌హానికి గుర‌వుతారోన‌ని వారు అంటున్నారు.

సీనియర్లలోనూ....

ఇక నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతూ జ‌గ‌న్ వెంట ఉన్న సీనియ‌ర్లు సైతం వైసీపీలో రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న‌తో ఉన్నార‌ని పార్టీ వ‌ర్గాల్లోనే చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి జిల్లాలోనూ నాయ‌కులు ఇలాగే భావిస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా జ‌గ‌న్ త‌న వ‌ద్ద ఉంచుకున్న అధికారాల‌ను నాయ‌కులకు అప్ప‌గిస్తే.. మంచిద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని వారు కోరుతున్నారు. మ‌రి జ‌గ‌న్ వింటారా? అనేది చూడాలి.

Similar News