వైసీపీలో వారంతా గాయబ్....? ఎందుకలా..?

Update: 2018-12-15 01:30 GMT

వైసీపీకి ఇంఛార్జులను నియమించడం మాత్రమే తన వంతు అన్నట్లుగా హై కమాండ్ వ్యవహరిస్తోంది. ఆ మీదట వారి బాధలు మాత్రం పట్టించుకోవడంలేదు. విశాఖ వైసీపీ లో ప్రస్తుతం ఈ కధ నడుస్తోంది. పరిస్థితి ఎలా ఉందంటే ఎవరికి వారే నాయకుడు అన్నట్లుగా తయారైంది. నాటి కాంగ్రెస్ కి నకలుగా వైసీపీ రూపుదిద్దుకుంటోందని విమర్శలు ఉన్నాయి. పార్టీ పదవులు తీసుకున్న వారంతా తామే రేపటి ఎమ్మెల్యేలమని భావించడమే కాదు. ఇంచార్జిలను ఎక్కడా ఖాతరు చేయడంలేదు. దీంతో సొంత పార్టీలోనే ఒంటరి పోరు చేయాల్సివస్తోందని ఇంచార్జిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పలు అసెంబ్లీ సీట్లలో ఇదే విధమైన వాతావరణం ఉంది.

ఆయనొక్కడే మరి.....

విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి ఇంచార్జిగా జగన్ ఏరి కోరి మరీ ఓ పేరున్న డాక్టర్ ని పిలిచి పెద్ద పీట వేశారు. ఆ డాక్టర్ గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టారో లేదో మిగిలిన నాయ‌కులంతా ఒక్కసారిగా గాయబ్ అయిపోయారు. ఆయన మటుకు తన వారితో కలసి ప్రచారం చేసుకోవాల్సివస్తోంది. అక్కడ ఓ యువజన నాయకుడు ఉన్నారు. ఆయన సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తానే ఇంచార్జి అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. ఇక మాజీ ఇంచార్జి గా ఉన్న కోలా గురువులు అయితే పత్తా లేకుండా పోయారు. పార్టీ అఫీస్ ప్రారంభించిన డాక్టర్ గారు తన మనుషులనే వెంట పెట్టుకుని జనంలోకి రావాల్సివస్తోంది.

అక్కడా ఇదే తీరు....

అదే విధంగా ఉత్తరం నియోజకవర్గంలోనూ సీన్ ఉంది. అక్కడ ముగ్గురిని ఇంచార్జిలుగా గతంలో నియమించారు. వారిని తప్పించి ఓ రియల్టర్ కి తాజాగా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన పార్టీ మీటింగులు పెడితే మాజీ ఇంచార్జిలు అలిగి రావడం లేదు. వారి అనుచరులు సైతం ఈ వైపుగా చూడదం లేదు. కొత్త ఇంచార్జి తనంతట తానే పార్టీని మొదలు నుంచి అక్కడ ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఇదే విషయాన్ని నగర ఇంచార్జిలకు చెప్పినా ప్రయోజనం లేకపోతోందని అంటున్నారు. ఎవరి మీద ఎవరికీ నియంత్రణ, పార్టీ మీద పట్టు లేకపోవడం వల్ల విశాఖ జిల్లా వైసీపీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తయారైందని విమర్శలు ఉన్నాయి.

సమన్వయం లేక.....

ఇక అందరినీ సముదాయించి ఒక్కటిగా చేయాల్సిన చూడాల్సిన బాధ్యతను జిల్లా నాయకత్వాలు మరచిపోయి చాలా కాలమే అయింది వారు సైతం ఏదో పార్టీ నడుస్తోంది అన్నట్లుగా ఉదాసీనంగా ఉంటున్నారు. ఎన్నికలు చూస్తే దగ్గరలో ఉన్నాయి. పార్టీలోనే కో ఆర్డినేషన్ లేకపోతే రేపు జనంలోకి ఎలా వెళ్ళి ఓట్లు వేయించుకోగలమని ఇంచార్జిలతో పాటు పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి హై కమాండ్ ఇవన్నీ పట్టించుకుని సర్దుబాటు చేస్తుందా అన్నది చూడాలి.

Similar News