ఖచ్చితంగా గెలిచే సీటు పోతుందా.... !!

Update: 2018-12-23 02:00 GMT

ఖచ్చితంగా అది గెలిచే సీటు, పోయిన ఎన్నికల్లోనే దగ్గరగా వచ్చి విజయం పలకరించిన చోటు. ఈసారి అన్నీ కలసివచ్చి విజయవిహారం చేయాల్సిన చోట చేజేతుల్లా వైసీపీ నేతలు పాడుచేసుకుంటున్నారా అనిపిస్తోంది. వర్గ పోరుతో అసలుకే ఎసరు తెచ్చుకుంటున్న వైనం ఇపుడు పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. పాదయాత్రకు వచ్చిన జగన్ పార్టీని మరింతగా పటిష్టం చేసిన ఆ నియోజకవర్గం పేరు నర్శీపట్నం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆ నర్శీపట్నం వైసీపీ పట్నం అవుతుందని అంతా ఆశిస్తున్న వేళ పార్టీలో గ్రూపులు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

వర్గ పోరు...

వైసీపీలో కొత్తగా వచ్చిన రుత్తల ఎర్రాపాత్రుడుకి, ఇంఛార్జి పెట్ల ఉమా శంకర్ గణేష్ కి మధ్యన వర్గ పోరు సాగుతోంది. జగన్ పాదయాత్రకు వచ్చిన సందర్భంగా ఎర్రాపాత్రుడిని పార్టీలోకి తీసుకున్నారు. బలమైన నాయకునిగా ఆ ప్రాంతంలో పేరున్న ఎర్రాపాత్రుడు వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని జగన్ అంచనా వేసి మరీ కండువా కప్పారు. అనుకున్నట్లుగానే ఎర్రాపాత్రుడు ప్రజా సమస్యలతో జనంలోకి దూసుకుపోతున్నారు. తాజాగా అక్కడ అన్రాక్ కంపెనీకి బాక్సైట్ గనులు కేటాయించాలని కోరుతూ నిర్వాసితులతో కలసి పోరాటం చేస్తున్నారు. దానికి జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. దాదాపుగా ఇరవై వేలమంది ప్రజానీకం ఈ సమస్యపై పోరాడుతున్నారు. వారి అండ దొరికితే వైసీపీ గెలుపు అక్కడ నల్లేరు మీద నడకే అవుతుంది.

తొంగి చూడని వైనం....

ఇంతటి పోరాటం అక్కడ జరుగుతూంటే ఆ వైపుగా కూడా ఇంచార్జి ఉమా శంకర్ తొంగి చూడకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రజా సమస్యలపై వైసీపీ నాయకులు తీరు ఇలా ఉందని జనం నుంచి సెటైర్లు పడుతున్నాయి. మరో వైపు బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా ఈ పోరాటానికి మద్దతుగా నిలిస్తే ఉమా శంకర్ మాత్రం దూరంగా ఉండడం పట్ల సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది. దీనికి కారణం ఎర్రాపాత్రుడుతో ఉమా శంకర్ కి పొసగకపోవడమేనని అంటున్నారు.అక్కడ ఉద్యమం హిట్ అయితే ఎర్రాపాత్రుడికి ఎక్కడ పేరు వస్తుందోనన్న ఆందోళనతోనే ఉమా శంకర్ ఆయన నాయకత్వంలో చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలేదని అంటున్నారు. ఇదిలా ఉండగాఎర్రాపాత్రుడికి జనంలో బలం బాగా ఉంది. ఆయన అంతకు ముందు ప్రజారాజ్యం తరఫున పోటీ చేస్తే ఇరవై వేల ఓట్లు వచ్చాయి. అటువంటి నేతను అండగా ఉంచుకుంటే ఉమా శంకర్ విజయం ఖాయమవుతుందని, కానీ వర్గ పోరుతో పార్టీని పడకేయిస్తున్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం హై కమాండ్ చక్కదిద్దాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.

Similar News