అక్కడ వైసీపీ గెలవకూడదని...?

Update: 2018-12-31 14:30 GMT

విజయనగరం జిల్లాలో రాజకీయ కుటుంబాలు అనేకం ఉన్నాయి. అన్న ఒక పార్టీలో తమ్ముడు వేరొక పాటీలో కొనసాగుతున్న వారు ఎందరో ఉన్నారు. విజయనగరం మహారాజుల విషయానికే వస్తే అన్న ఆనందగజపతిరాజు కాంగ్రెస్ లో ఉంటే తమ్ముడు అశోక్ గజపతి రాజు టీడీపీలో కొనసాగారు. ఇక ఇదే జిల్లాలో శత్రుచర్ల కుటుంబం ఒకటి రాజకీయంగా మంచి పలుకుబడి కలిగినది. శత్రుచర్ల విజయరామరాజు, శత్రుచర్ల చంద్రశేఖరరాజు కాంగ్రెస్ లో ఉంటే వారు తరువాత తమ్ముడు చంద్రశేఖరరావు వైసీపీలోకి వెళ్తే అన్న విజయరామరాజు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. ఆ మధ్యన చంద్రశేఖరరావు కూడా టీడీపీ కండువా వేసుకున్నారు. శత్రుచర్ల కుటుంబానికి పార్వతీపురం, కురుపాంలలో మంచి బలం ఉంది.

సిట్టింగ్ ఎమ్మెల్యేకి పోటీగా....

కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాముల శ్రీ పుష్ప శ్రీవాణి ఉన్నారు. ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్ రాజు కూడా అదే పార్టీలో ఉన్నారు. అయితే పరీక్షిత్ రాజు తండ్రి అయిన శత్రుచర్ల చంద్రశేఖరరాజు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున మరో మారు సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పోటీ చేయనుంది. మొత్తం నియోజకవర్గంలో మంచి బలం ఉన్న ఆమెకే టికెట్ ఇచ్చేందుకు జగన్ డిసైడ్ అయ్యారు. ఈ మధ్యన జరిగిన పాదయాత్రలోనూ కురుపాంలో జనం వెల్లువలా వచ్చారు. దాంతో వైసీపీకి గెలుపు ధీమా బాగా పెరిగింది. దాంతో ఆమెను ఓడించేందుకు టీడీపీ కొత్త అస్త్రాలను ప్రయోగిస్తోంది.

మామనే బరిలోకి....

పుష్ప శ్రీవాణిని ఢీ కొట్టాలంటే మామ, సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజునే బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. కురుపాం రాజులుగా శత్రుచర్ల కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. అందువల్ల వేరెవరిని పోటీ చేయించినా ఇక్కడ ఫలితం తారుమారు అవుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో శ్రీవాణి దాదాపు ఇరవై వేల ఓట్ల మెజారిటీతో టిడీపీ అభ్యర్ధి జనార్ధన్ తాట్రాజ్ మీద గెలిచారు.జనార్ధన్ తాట్రాజ్ 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే. ఆయన టీడీపీలో చేరి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఇపుడు ఆయన్ని పక్కన పెట్టి ఏకంగా శత్రుచర్ల కుటుంబంలోని వారినే పోటీ పెడితేనే విజయం వరిస్తుందని టీడీపీ భావిస్తోంది. మరి ఈ పోటీకి చంద్రశేఖర రాజు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి. ఆయన సై అంటే మాత్రం ఇక్కడ మామా కోడళ్ళ మధ్యన రసవత్తరమైన పోటీ జరగడం ఖాయం. మరి ఈ సమరంలో ఎవరు విజేత అవుతారో చూడాలి.

Similar News