వైసీపీ: ఆమెను మార్చే చాన్సే లేదు..!

Update: 2018-12-23 12:30 GMT

ఉత్త‌రాంధ్ర‌లోని అత్యంత కీల‌క‌మైన సిట్టింగ్ నియోజ‌క‌వ‌ర్గం పాల‌కొండ‌. 2014లో ఇక్క‌డ నుంచి వైసీపీ విజ‌యం సాధించింది. వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి ఘ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం టీడీపీ ఏర్పాటు చేసినా.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆమె చేరువయ్యారు. ప్ర‌తి విష‌యంలోనూ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నారు. అంద‌రినీ క‌లుపుకొని పోతూ.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ప‌రిష్క‌రించేందుకు ముందుకు వ‌స్తున్నారు. మ‌హిళ‌ల‌కు కూడా క‌ళావ‌తి అండ‌గా నిలుస్తున్నారు. దీంతో ఆమెను త‌మ సొంత ఇంటి ఆడ‌ప‌డుచుగా ఇక్క‌డి వారు భావిస్తున్నారు.

మార్చేది లేదంటున్న....

నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గిరిజ‌నుల‌తో పాటు గిరిజ‌నేత‌రుల్లోనూ ఆమెకు ఇక్క‌డ మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేప‌థ్యంలో ఆమెను మించిన నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఎవ‌రిలోనూ ఇక్క‌డ క‌నిపించ‌డం లేద‌ని కూడా భావిస్తున్న‌ట్టు సీనియ‌ర్ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతు న్నారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు ఇంచార్జుల‌ను మారుతున్న క్ర‌మంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా త‌మకు టికెట్ వ‌స్తుందా? రాదా? అనే సందేహంలో మునిగిపోయారు. కానీ, క‌ళావ‌తి విష‌యంలో మాత్రం జ‌గ‌న్ చాలా ధైర్యంగా ఉన్నార‌ని, ఆమెను మార్చే ప్ర‌స‌క్తి లేద‌ని అంటున్నారు. దీంతో మ‌రోసారి పాలకొండ వైసీపీ ఖాతాలోకే ప‌డుతుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిణామం ఈ నెల ఆరంభం వ‌ర‌కు ఉన్న ప‌రిస్థితి మాత్ర‌మే.

ఆర్థికంగా బలంగా ఉండాలని...

అయితే, ఇప్పుడు ఇక్క‌డి వ్య‌వ‌హారాల‌ను పార్టీ అధికార ప్ర‌తినిధి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి స‌మీక్షిం చారు. ఇక్క‌డ నుంచి టీడీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. అయితే, ఆ బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది విజ‌య‌సాయి మాత్రం వెల్ల‌డించ‌లేదు. కానీ, ఆయ‌న మాత్రం టీడీపీ ఇక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. కాబ‌ట్టి.. మ‌నం కూడా ఇక్క‌డ బలంగా ఉండాల‌ని సూచించారు. ఇంత‌టితో ఆగ‌కుండా.. ఇక్క‌డ నుంచి మ‌ళ్లీ క‌ళావ‌తికి టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేయాలంటే.. ఆమె ఆర్థికంగా బలంగా ఉండాలని ప‌రోక్షంగా తేల్చాశారు విజయ‌సాయి.

జగన్ ఓటు ఆమెకే...

దీంతో ఒకింత ఆశ్చ‌ర్యానికి గురైన ఆమె.. గ‌డిచిన కొన్ని రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. 2014లో తనకు టికెట్ ఇచ్చిన‌ప్పుడు జ‌గ‌న్ త‌న‌ను ఏమీ అడ‌గ‌లేద‌ని, కానీ, ఇప్పుడు పెత్త‌నం కొందరికి వ‌చ్చే స‌రికి డ‌బ్బుల ప్ర‌స్తావ‌న తెస్తున్నార‌ని.. తాను అంత మొత్తం ఎక్క‌డ నుంచి తీసుకు రాన‌ని అన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి ఒక‌వేళ త‌న‌ను కాద‌ని వేరేవారికి టికెట్ ఇస్తే.. ఇచ్చుకోమ‌ని కూడా ఆమె చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం కళావతికి ఎటువంటి ఇబ్బందులు ఉండవలని ఆమే అభ్యర్థి అని సంకేతాలు ఇచ్చారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక వాస్త‌వంగా కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌దేళ్లుగా క‌ళావ‌తి రాజ‌కీయాల్లో ప్ర‌జ‌ల‌కు చేరువుగా ఉంటున్నారు. 2009లో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసి గ‌ట్టి పోటీ ఇచ్చిన ఆమె గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి విజ‌యం సాధించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ ఆమె పోటీ చేస్తే సానుకూల ప‌వ‌నాలే ఉంటాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆమెకు తప్ప ఎవరికి సీటు ఇస్తారన్న చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

Similar News