అయోమయం... ‘‘జగన్నా’’ధం !!

Update: 2018-12-27 15:30 GMT

వైసీపీలో పూర్తి అయోమయం నెలకొంది. ఉత్తరాంధ్రలో జగన్ పాదయాత్ర కొద్ది రోజుల్లో ముగుస్తోంది కానీ పార్టీలో మాత్రం పూర్వపు జోష్ కనిపించడంలేదు. ఓ వైపు ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ అంతటా నిస్తేజం వైసీపీని ఆవహించింది. దీనికి కారణం అధినాయకత్వం వైఖరి అని చెప్పుకోవాలి. జగన్ పాదయాత్రకు తమ ప్రాంతానికి వస్తారు, తమ కష్టాన్ని చూసి తగిన బాధ్యతలు అప్పగిస్తారని ఆశ పడిన వారందరినీ నిరాశలో ముంచుతూ జగన్ ముందుకు సాగిపోయారు. ప్రతి నియోజకవర్గంలో కనీసంగా నాలుగేసి రోజులు పాదయాత్ర జరిగింది. పార్టీ ఇంచార్జులు, ఆశావహులు డబ్బు బాగా ఖర్చు చేసి మరీ జగన్ పాదయాత్రని విజయవంతం చేశారు. తీరా అంతా చేసినా జగన్ వారిలో ఎవరో ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించకుండా షాక్ కి గురి చేశారు.

అన్నింటా అదే స్థితి...

పోయిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ బొక్క బోర్లా పడింది. ఆ పార్టీ మొత్తానికి మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం తొమ్మిది చోట్లనే గెలిచింది. ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో పార్టీ బాగా బలపడింది. జగన్ పాదయాత్రలో దాన్ని మరింతగా పటిష్టం చేశారు కూడా. ఎన్నికలకు ముందే ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటిస్తే జనంలోకి వెళ్ళి విజయావకాశాలు పెంచుకోవచ్చునని ఆశపడిన వారంతా జగన్ ఎక్కడికక్కడ ఏమీ చెప్పకుండా ముందుకు సాగిపోవడంతో డీలా పడిపోయారు. పరిస్థితి ఎలా ఉందంటే కొత్త వారే కాదు సీనియర్లు అనుకున్న వారు సైతం ఇపుడు తమకు టికెట్లు దక్కుతాయా అన్న సందేహంలో పడిపోయారు. జగన్ మదిలో ఏముందో తెలియదు కానీ ఆశావహులకు మాత్రం పాదయాత్ర పుణ్యమాని ఎక్కడలేని నీరశం వచ్చేసిందని అంటున్నారు.

ఒక్కో చోటా నలుగురు...

ఇక పాదయాత్ర తరువాత గ్రూపు తగదాలు తగ్గాల్సింది పోయి మరింతగా పెరిగిపోయాయి. ఒక్కో అసెంబ్లీ సీటుకు నలుగురైదుగురు పోటీ పడుతూంటే అధినాయకత్వం ఏమీ పట్టనట్లుగా ఉంటోంది. ఇక పాదయాత్రకు ముందు తమకే టికెట్ అనుకుని అంతా ఎవరి మటుకు వారు పని చేశారు. ఇపుడు టికెట్ వస్తుందో రాదో అనుకుంటూ అంతా పడకేయడంతో ఎక్కడికక్కడ పార్టీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. పాదయాత్రలో ఉత్తుంగ తరంగాలుగా ఎగిసిపడిన పార్టీ నేతలు ఇపుదు స్తబ్దుగా ఉండిపోతున్నారు. ఇక వీరిలో రేపటి రోజున ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు ఫిరాయించడం ఖాయం. ఇక అందరినీ కాదని కొత్త వారిని తెస్తే ఉన్న వారే ఏకమై ఓడించడం ఖాయం. ఇలా ఉంది ఉత్తరాంధ్రాలో వైసీపీ పరిస్థితి.

Similar News