వైసీపీలో ఆ ...ఫీవర్..వైరల్... !!

Update: 2018-12-31 02:00 GMT

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు ఇపుడు ఎన్నికల జ్వరం పట్టుకుంది. కొత్త ఏడాది వస్తోందన్న ఆనందం కంటే ఎన్నికలు దగ్గర పడ్డాయన్న ఆందోళన ఎక్కువైపోతోంది. మరో వైపు వైసీపీ అధినేత సుదీర్ఘ పాదయాత్ర కూడా పూర్తి అవుతోంది. జగన్ మళ్ళీ పార్టీ వైపు యాక్టివ్ గా వస్తే తమ జాతకాలు ఎలా ఉంటాయోనని తల్లడిల్లుతున్నారు. వీటన్నిటింకీ వేదికగా ఇచ్చాపురం మారనుందంటున్నారు. జనవరి రెండవవారంలో జగన్ పాదయాత్ర ముగియనుంది. దానికి సూచికగా ఇచ్చాపురంలో భారీ బహిరంగ సభను జగన్ నిర్వహిస్తున్నారు. ఆ సభలో అనేక కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాలలో ప్రచారం సాగుతోంది.

అభర్ధుల ప్రకటన‌...

పాదయాత్ర ముగింపు రోజునే ఎన్నికల శంఖారావాన్ని జగన్ పూరిస్తారని అంటున్నారు. దానికి నాందిగా పలు సంచలన నిర్ణయాలు కూడా జగన్ తీసుకుంటారని చెబుతున్నారు. వైసీపీ అభ్యర్ధుల తొలి జాబితాను కూడా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఎన్నింటికి జగన్ ప్రకటిస్తారన్నది కూడా ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా ఉంది. అలాగే లోక్ సభ లిస్ట్ ఒకటి ప్రకటిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఈ రకమైన వార్తలతో వైసీపీ శిబిరం వేడెక్కిపోతోంది.

జగన్ చేతిలో నివేదికలు...

ఇచ్చాపురం వేదికగా జగన్ ఎవరికి షాక్ ఇస్తారన్నది ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. ఆ రోజుకు జగన్ మొత్తం పదమూడు జిల్లాలు పాదయాత్రతో చుట్టేసి నట్లవుతుంది. జగన్ కి అన్నీ స్వయంగా తెలుసు, పైగా ఆయన సొంత నివేదికలు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు ఎప్పటికపుడు సర్వేలు కూడా చేయిస్తూ మొత్తం అందరి జాతకాలను తన దగ్గర ఉంచుకున్నారని అంటున్నారు. దాంతో ఎవరికి వేటు, మరెవరికి ఓటు అన్నది అధినేత నోటి వెంట వస్తే తప్ప ఏమీ తెలియని స్థితి ఉంది.

ఇంచార్జులకు టికెట్లు....

పలు నియోజకవర్గాల్లో ఉన్న సింగిల్ ఇంచార్జులకు టికెట్లు ఖాయమేనా అన్న చర్చ సాగుతోంది. లేదా వేరే వారిని ఆఖరి నిముషంలో తెస్తారా అన్న బెంగ కూడా నాయకుల్లో వుంది. విశాఖ విషయానికి వస్తే మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా సీట్లలో ఒకరే ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు. అటువంటి వారిని తొలి జాబితాలో ప్రకటిస్తారని అంటున్నారు. వైసీపీ వర్గాల అంచనా ప్రకారం చూసుకుంటే అర్బన్ జిల్లాలో విశాఖ దక్షిణం, తూర్పు, ఉత్తరం, పశ్చిమం, గాజువాక సీట్లు ప్రకటిస్తారని అంటున్నారు. రూరల్ జిల్లాలో తీసుకుంటే అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, సీట్లకు అభర్ధులను జగన్ ప్రకటించవచ్చునని అంటున్నారు. విశాఖ ఎంపీ టికెట్ ఎంవీవీ సత్యనారాయణకు దక్కవచ్చునని అంటున్నారు. ఏజెన్సీతో పాటు, మిగిలిన చోట్ల అభ్యర్ధులు మారే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాడుగుల సిట్టింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుకు కూడా తొలి జాబితాలో చోటు దక్కదేమోనన్న అనుమానలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి.

Similar News