ఒకరిని పక్కన పెట్టాల్సిందే...!!!

Update: 2018-12-14 03:30 GMT

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు- అన్న‌ట్టుగా ఎన్నిక‌ల‌కు ఇంకా చాలానే స‌మ‌యం ఉంది. అయినా కూడా శ్రీకాకుళం జిల్లాలోని బోర్డ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ఇచ్ఛాపురం. ఇది ఒడిశాను ఆనుకుని ఉంటుంది. అయితే, ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. బీ అశోక్ టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పాగావేయాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. కానీ, నేత‌లు మాత్రం పార్టీ గురించి కాకుండా.. త‌న సొంత వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకునేందుకు, ఆధిప‌త్యం చ‌లాయించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పైగా ఇక్క‌డ టికెట్ త‌న దేన‌ని, గెలుపు ఖాయ‌మ‌ని ఓ గ‌ళం వినిపిస్తుండ‌డంతో పార్టీనిలైన్‌లో పెట్టేవారు కూడా లేరా ? అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. నియోజ కవర్గం వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇక‌, ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య విభేదాలు, పార్టీ ప‌ట్టుకోల్పోవ‌డానికి ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానే జ‌గ‌న్ కూడా కార‌ణ‌మే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఎవరి దారి వారిదే....

ఇక్క‌డ 2014 త‌ర్వాత నుంచి పార్టీ అధిష్ఠానం నియోజ‌క‌వ‌ర్గం సమన్వయకర్తలను మారుస్తూనే ఉంది. దీంతో నేత‌ల మ‌ధ్య విభేదాలు తార స్థాయి చేరి పార్టీ స్థానిక ప్ర‌జ‌ల‌పై పట్టు కోల్పోయింది. జిల్లాస్థాయి నాయకులు సైతం స్వయంగా గ్రూపులను ప్రోత్సహిస్తుండడంతో కేడర్‌ కూడా చీలిపోయింది. జ‌గ‌న్ ఏ కార్య‌క్ర‌మానికి పిలుపు ఇచ్చినా కూడా నాయకులు మాత్రం త‌మ దారిలో తాము నిర్వ‌హించుకుంటున్నారు త‌ప్పితే.. పార్టీ అధినేత ల‌క్ష్యానికి అనుగుణంగా మాత్రం ప‌నిచేయ‌డం లేదు. ప్రస్తుత సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ పేరుకు సమన్వయకర్త అయినా ఈయనకు ఏ ఒక్కరూ సహకరించడం లేదు. గతంలో ఈయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మునుపట్లో తనకున్న కేడర్‌, నాయకుల బలంతో బండిని భారంగా లాక్కొస్తున్నారు. కానీ వెనక నుంచి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన నర్తు రామారావు.. అధిష్ఠానం నిర్ణయంతో సంబంధం లేకుండా టిక్కెట్‌ తనదేనంటూ గ్రూపులతో పార్టీని నడిపిస్తున్నారు.

జగన్ ఏం చేస్తారు...?

దీంతో నియోజకవర్గంలో పార్టీ చిక్కుల్లో పడింది. పార్టీ నేతలు శ్యాంప్రసాదరెడ్డి, పిలక రాజలక్ష్మి తదితరులు సమన్వయకర్త సాయిరాజ్‌తో సంబంధం లేకుండా గ్రూపులు నడుపుతున్నారు. అటు అధిష్ఠానం, జిల్లా నాయకత్వం కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో పార్టీ బలహీనంగా మారింది. నాయకులు ఎక్కువైపోవడంతో పార్టీలో ఐక్యత కనుమరుగైపోయింది. మరోకప్క సాయి రాజ్‌ ఈ గ్రూపులతో ఎన్నికలకు వెళ్లడం కష్టమనే నిస్సహాయతలో ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రూపులతో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా .. ఇక్క‌డ పార్టీ అధినేత జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర త‌మ‌కు లాభిస్తుంద‌ని మిగిలిన నాయ‌కులు భావిస్తున్నారు. వీరి ఆధిప‌త్య ధోర‌ణికి జ‌గ‌న్ చెక్ పెడ‌తార‌ని వారు చ‌ర్చించుకుంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు నిర్ణ‌యం తీసుకోక పోతే.. ఎన్నిక‌ల నాటికి వివాదాలు మ‌రింత ముదిరి ప‌రిస్థితి చేయిదాటేలా ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Similar News