ఇక్కడ సీట్లు ఎన్ని తెచ్చుకోవాలంటే....!

Update: 2018-12-08 14:30 GMT

ఉత్త‌రాంధ్ర‌లో అత్యంత కీల‌క‌మైన జిల్లా శ్రీకాకుళం. ఇక్క‌డ ఎవ‌రు స‌త్తా చాటితే.. వారికే అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్క‌డ ప్ర‌జ‌లు మిశ్ర‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసే ల‌క్ష‌ణం ఉన్న‌వారు కావ‌డంతో .. ఇక్క‌డ వారిని ఆక‌ట్టుకునేందుకు పార్టీలు, నాయ‌కులు కూడా శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో శ్రీకాకుళంలో టీడీపీ స‌త్తా చాటింద‌నే చెప్పాలి. ఇక్క‌డ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఏడింటిలో టీడీపీ విజ‌యం సాదించింది. మిగిలిన మూడు సీట్ల‌ను వైసీపీ ద‌క్కించుకుంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి ప‌రిస్థితి భిన్నంగా ఉంటుద‌నే ఇప్ప‌టికే స‌ర్వేలు వ‌చ్చాయి. ఇక్క‌డ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ టార్గెట్ చేశారు. క‌నీసం 3 స్థానాల్లో ఆయ‌న ప్ర‌భావం చూపేలా ఇక్క‌డ ప‌లు మార్లు ప‌ర్య‌టించారు. కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకు వ‌చ్చి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఆశాజ్యోతిగా మారాడ‌ని అప్ప‌ట్లో ప‌లు మీడియాల్లో క‌థ‌నాలు వ‌చ్చాయి.

పుంజుకుంటేనే.....

ఇక‌, ఇక్క‌డి ప‌లు ప్రాంతాల్లో ఆయ‌న ప‌ర్య‌ట‌న కూడా చేశారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర సిక్కోలు జిల్లాలోనే జరుగుతుంది. ఇప్పటికి రెండు నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తయింది. ఈ జిల్లాలోని ఒడిశా స‌రిహ‌ద్దు ప్రాంతం ఇచ్ఛాపురంలో ఆయ‌న ప‌ర్య‌ట‌న వ‌చ్చే నెల ముగియ నుంది. దీంతో ఇక్క‌డి నాయ‌కులు జ‌గ‌న్‌పై చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 3 స్థానాల్లోనే విజ‌యం సాధించిన వైసీపీ.. క‌నీసం 7కు ఎగ‌బాకాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శ్రీకాకుళం లెక్క‌లు తెలిసిన నాయ‌కులు చెబుతున్నారు. ఈ జిల్లాలో రాజ‌కీయాల‌ను ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి వారు భుజాల‌కు ఎత్తుకున్నారు. మ‌రో నాలుగు మాసాల్లోనే.. ఇక్క‌డ వైసీపీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, ప్ర‌స్తుతం ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న రాజ‌కీయ ప‌రిస్థితి, ముఖ్యంగా వైసీపీ నేత‌ల మ‌ధ్య ప‌రిస్థితిని ఒక్క‌సారి స‌మీక్షిస్తే.. వైసీపీ ప‌రిస్థితిని చెప్పడానికి కొంచెం.. క‌ఠినంగానే ఉన్నా.. కుక్క‌లు చింపిన విస్త‌రి మాదిరిగానే క‌నిపిస్తోంది.

ఆధిపత్య పోరుతో....

మూడు స్థానాల‌ను గెలుచుకున్న సంతోషం క‌న్నా.. ఈ మూడు చోట్ల స‌హా మిగిలిన స్థానాల్లోనూ వైసీపీని బ‌ల‌ప‌రిచే నాయ‌కుడు క‌నిపించ‌డం లేదు. పైగా శ్రీకాకుళంలో కీల‌క‌మైన వైసీపీ నాయ‌కులు ఆధిప‌త్య ధోర‌ణిలో ముందుకు వెళ్తున్నారు. ఎవ‌రికివారు పైచేయి సాధించేందుకు ప్ర‌యత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా.. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పాతపట్నంలో పాత-కొత్త నాయకత్వాల మధ్య ఆధిపత్య పోరుతో నాయకులు సతమతమవుతున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో పాత-కొత్త వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బూత్‌స్థాయి కమిటీలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి రెడ్డిశాంతి కనుసన్నల్లోనే జరగడంతో అసలు నాయకులకు చోటు దక్కలేదని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఈమె స్థానికేతర వ్యక్తి కావడంతో కేడర్‌ కూడా ఈమె నాయకత్వాన్ని అంగీకరించడానికి ఇష్టపడడం లేదు.

ధర్మాన కు మైనస్ ఇదే....

ఎచ్చెర్ల వైసీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్‌ కుటుంబంలో వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తుండడంతో మిగతా కేడర్‌ పార్టీకి దూరమవుతున్నారు. ఇక్క‌డ మంత్రిగా ఉన్న ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావు ప్రాధినిత్యం వ‌హిస్తున్నారు. ఆయ‌న్ను గొర్లె ఎంత వ‌ర‌కు ఢీ కొడ‌తార‌న్న‌ది సందేహ‌మే. నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన ప్రసాద రావు, ధర్మాన కృష్ణదాస్‌ అన్నదమ్ములైనా వీరి అనుచరులు రెండుగా చీలిపోవడం పార్టీకి మైనస్‌గా మారింది. ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ నేత సువ్వారి గాంధీ, నియోజవర్గ కన్వీనర్‌ తమ్మినేని సీతారాంకు మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ నాయకులంతా కలిసివున్నట్లు ఒకరికొకరు పైకి కనిపిస్తున్నా అంతర్గత పోరుకు హద్దే లేదు. ఇక్క‌డ పేరాడ తిల‌క్‌కు, దువ్వాడ శ్రీను వ‌ర్గాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.

యాత్ర ముగిసేలోగా.....

పాలకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కళావతి ఏదోలా నెట్టుకు వస్తున్నా క్షేత్రస్థాయిలో కేడర్‌ సమస్యగా మారింది. దీంతో ఇప్పుడు ఇక్క‌డ పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్ ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి పార్టీని ప‌రుగులు పెట్టించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మరికొద్ద రోజుల్లోనే శ్రీకాకుళంలో జగన్ పాదయాత్ర ముగియనుంది. పాదయాత్రకు విరామం ఇచ్చిన సమయంలో నియోజకవర్గ నేతలతో జగన్ ముచ్చటిస్తున్నారు. ఏదేమైనా శ్రీకాకుళం జిల్లాలో అధికార టీడీపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకోవ‌డంలో వైసీపీ మరింత కష్టపడాల్సి ఉంది. మ‌రి, జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Similar News