ఆంధ్రప్రదేశ్: ముగ్గురూ ముగ్గురే..!

Update: 2018-12-24 11:00 GMT

రాష్ట్రంలో ఏ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌ల‌సినా.. ''మ‌న‌ద‌గ్గ‌ర ప‌రిస్థితేంటో!!''- అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇటీవ‌లే తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. అక్క‌డ అనుకున్న దానికంటే భిన్నంగా అధికార పార్టీ తిరిగి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఇప్పుడు అటు తెలంగాణా.. ఇటు ఏపీల్లోనూ కూడా ఏపీలో ఏం జ‌రుగుతుంది? ఇక్క‌డ ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఇక్క‌డ ఏ నాయ‌కుడు ప‌గ్గాలు చేప‌డ‌తాడు? అనే చ‌ర్చ భారీగానే జ‌రుగుతోంది. క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల్లోనూ ఈ చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. దీనిని విశ్లేషిస్తే.. తెలంగాణా రాజ‌కీయాల‌కు, ఏపీ రాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా వ్యత్యాసం క‌నిపిస్తోంది.

తెలంగాణ పరిస్థితి వేరు....

అక్క‌డ అధికార పార్టీ తిరిగి పీఠం ఎక్క‌డానికి ఉన్న ప‌రిస్థితులు వేరు. అక్క‌డ సెంటిమెంట్ ప‌నిచేసిందా..? లేక ప్ర‌భుత్వ ప‌థ‌కాలే త‌మ‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్టాయా? అనే చ‌ర్చ కూడా కొన‌సాగుతోంది. అక్క‌డి టీఆర్ ఎస్ నాయ‌కులు త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేసిన విస్తృత ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలే త‌మ‌కు తిరిగి అధికారం ద‌క్కేలా చేశాయ‌ని చెప్పుకొం టుంటే.. మ‌రో వ‌ర్గం మాత్రం బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం లేక‌పోవ‌డం, కాంగ్రెస్‌లో బ‌ల‌మైన నాయ‌కుడు లేక‌పోవ‌డం కూడా కేసీఆర్‌కు క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పుకొంటున్నారు. ఇక‌, ఈ రెంటికీ భిన్నంగా ఉన్న కొంద‌రు మాత్రం టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు తెలంగాణాలో ఎప్పుడైతే కాలు మోపాడో .. అప్పుడే కేసీఆర్ విజ‌యం ఖాయ‌మైంద‌ని అంటున్నారు.

త్రిముఖ పోటీ ఉండటంతో....

ఈ విశ్లేష‌ణ‌ల ఆలంబ‌న‌గా ఏపీలో ఏం జ‌రుగుతుంది? అనే చ‌ర్చ మాత్రం సాగుతోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు చాలా డిఫ‌రెంట్‌గా ఉన్నాయి. ఉన్న మూడు ప్ర‌ధాన పార్టీలు టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌ల్లో.. ఆయా పార్టీల అధినేత‌లు బ‌లంగానే ఉన్నారు. ఎవ‌రికి వారు ఒంట‌రిపోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక‌, తెలంగాణాలో మాదిరిగా ఇక్క‌డ సెంటిమెంట్ అంటే.. కేవ‌లం ప్ర‌త్యేక హోదా ఒక్క‌టే క‌నిపిస్తోంది. ఇక‌, ప్ర‌భుత్వం ఊద‌ర‌గొడుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై దాదాపు స‌గానికిపైగా ప్ర‌జ‌లు సంతృప్తిగా లేరు. చంద్ర‌బాబు అంటే.. ఇప్పుడు చాలా మంది అభిప్రాయం ఆయ‌న మాట‌ల మ‌నిషి- అనేది వినిపిస్తోంది. దీంతో పెద్ద‌గా చంద్ర‌బాబు ప‌ట్ల సానుకూల‌త లేకుండా పోయింది.

జగన్ కూడా క్లియర్ గా లేరా?

అదే స‌మయంలో మిగిలిన ఇద్ద‌రు నాయ‌కులు జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌పై పెద్ద ఎత్తున ఏమ‌న్నా సానుభూతి ఉందా? అంటే అది కూడా క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ వ్యూహ‌లేమి, నాయ‌కుల ఐక్య‌త‌ను ప‌ట్టించుకోకుండా తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. పార్టీపై కింది స్థాయి నేత‌ల‌కు ఇంకా ప‌ట్టుచిక్క‌క‌పోవ‌డం వంటి కార‌ణాలు.. ఏం చేస్తే.. అధినేత ఏమంటాడో అనే జంకు! వంటివి పార్టీని ముందుకు తీసుకు వెళ్ల‌లేక పోతున్నాయి. దీంతో సానుభూతి ఉన్నా.. అది కొన్ని వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైంది. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ విష‌యానికి వ‌చ్చినా.. మెజారిటీ ప్ర‌జ‌ల్లో ఈయ‌న‌పైనా పెద్ద న‌మ్మ‌కం లేకుండా పోయంది. పార్టీ ప‌టిష్ట‌త‌కు ఇప్ప‌టికీ ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోలేదు. తాను అనుకున్న అజెండాను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. ఇలా మొత్తంగా ఈ ముగ్గురూ ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌ల మ‌న‌సులను చూర‌గొనే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా మేజిక్ ఫిగ‌ర్ మార్క్ మెజారిటీ స్థానాలు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని చ‌ర్చ‌ల సారాంశంగా తెలుస్తోంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి వీరిలో ఎవ‌రు పుంజుకుంటారో ? ఎన్నిక‌ల వేళ ఏ పార్టీకి అనుకూలంగా ఏపీ ఓట‌రు ట‌ర్న్ అవుతాడో ? చూడాలి.

Similar News