జగన్ కు అదే కలిసొచ్చేటట్లుంది....??

Update: 2018-12-19 14:30 GMT

అవును! ఏపీ ప్ర‌జ‌ల నాడి విభిన్నంగా మారుతోంది. అది కూడా తెలంగాణా ఎన్నిక‌ల స‌ర‌ళిని చూసిన త‌ర్వాత‌.. ఎక్కువ మంది మేధావులు చెబుతున్న విష‌యం ఇది! తెలంగాణాలో ప్ర‌తి ప‌క్షాన్ని ప్రజ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకున్నారా? లేరా ? అనే విష‌యాన్ని ఎన్నిక‌ల ఫలితాలను బ‌ట్టి అంచ‌నా వేస్తే.. పెద్ద‌గా ఏమీ ఒర‌గ‌లేద‌నే తెలుస్తోంది. నిజానికి ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఉన్నా కూడా స‌రైన ప్ర‌త్యామ్నాయం అక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌లేద‌ని, ఈ నేప‌థ్యంలోనే విధిలేని ప‌రిస్థితిలో కేసీఆర్‌కు ఓటేశార‌నే వాద‌న కూడా ఇప్పుడు వినిపిస్తోంది. అయితే, ఎన్నిక ల ఫ‌లితాలు కూడా అదే విషయాన్నిరుజువుచేశాయి. కానీ, తెలంగాణా ఎన్నిక‌లకు ముందు, త‌ర్వాత విప‌క్ష వ్య‌వ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల నాడి క‌నిపిస్తోంది.

వైసీపీ సక్సెస్ అయిందా?

ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో ప్ర‌తిప‌క్షాలు ఆశించిన మేర‌కు కృషి చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఇదే ప‌రిణామాన్ని ఏపీతోనూ ముడి పెడితే.. ఇక్క‌డ ప‌రిస్థితి ఏంటి? అనేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోం ది. ఏపీలోనూ ప్ర‌భుత్వంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. ఇసుక మాఫియా కావొచ్చు. అవినీతి కావొచ్చు. ఎమ్మెల్యేల దౌర్జ‌న్యం కావొచ్చు. ప్ర‌త్యేక హోదా సాధించలేకపోయిన విష‌యం కావొచ్చు. మాట‌లు మారుస్తున్న సీఎం కావొచ్చు. . ఇలా అనేక విష యాల‌పై ప్ర‌జ‌ల్లో ప్రభుత్వంపై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. మ‌రి దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే విష‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ ఎంత‌మేర‌కు స‌క్సెస్ అయింది? ఏ మేర‌కు ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచింది ? అన్న‌ చర్చ నడుస్తోంది.

ప్రత్యామ్నాయంగా.....

అంతేకాదు, ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా.. చంద్ర‌బాబుకు ప్ర‌త్యామ్నాయంగా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎదిగారా? అనే ప్ర‌శ్న‌లు తెర మీదికి వ‌స్తున్నాయి. తెలంగాణా ఎన్నిక‌ల ఫలితాన్ని గ‌మ‌నించిన మేధావులు ఈ ప్ర‌శ్న‌లే వేస్తున్నారు. పాద‌యాత్ర ద్వారా సీఎం పీఠం ద‌క్కించుకుందామ‌ని చూస్తున్న జ‌గ‌న్‌ను ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ప్ర‌జ‌లు ఎప్పుడో గుర్తించారంటున్నారు. గత ఎన్నికల్లోనే జగన్ పార్టీకి, టీడీపీకి స్వల్ప ఓట్ల తేడానని గుర్తు చేస్తున్నారు. పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి పాతిక మార్కులు మాత్ర‌మే వేసిందని, మిగిలిన జగన్ వివిధ పోరాటాల ద్వారా ఎప్పుడో తెచ్చుకున్నారంటున్నారు.

జనంలోనే ఉండటం....

అంతేకాకుండా జగన్ నాలుగున్నరేళ్ల నుంచి నిత్యం ప్రజల్లో ఉండటం ఆయనకు ప్లస్ గా మారనుంది. ప్ర‌జ‌ల్లో మాత్రం చంద్రబాబుకు ప్ర‌త్యామ్నాయ స్థానాన్ని జ‌గ‌న్ సుస్థిరం చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణాలో కేసీఆర్‌కు ప్ర‌త్యామ్నాయంగా ఏ ఒక్క నేత ఎదిగి ఉన్నా.. ఇప్పుడు అక్క‌డ ప్ర‌తిప‌క్షం అతి దారుణంగా ఓటమిపాలయ్యే ప‌రిస్థితి ఉండేది కాద‌ు. అయితే జగన్ ఇప్పటికే బలమైన శక్తిగా ఉన్నారన్నది అందరూ అంగీకరించే విషయం. ప్రజలు మరి పాదయాత్రతో కాకున్నా ప్రత్యామ్నాయంగా జగన్ ను ఆదిరిస్తారన్న అంచనా వినపడుతోంది.

Similar News