జగన్ ఇక వెంటాడటం ఖాయమా.....!!

Update: 2018-12-12 13:30 GMT

తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ పై అనివార్యంగా ప్రభావం చూపుతాయని అంటున్నారు విశ్లేషకులు. అయోమయంగా మారిన ఏపీ పాలిటిక్స్ లో ఇప్పుడు విపక్షాలు అధికార టిడిపి పై దూకుడు పెంచడం ఖాయంగా కనిపిస్తుంది. తెలంగాణ లో మహాకూటమి విఫల ప్రయోగం గా మిగిలి పోవడంతో వివిధ పార్టీలు ఒక్కటై అధికారపక్షం పై పోరాటానికి వెళ్లేందుకు సిద్ధం కావంటున్నారు పరిశీలకులు. వైసిపి, జనసేన కలిసే అవకాశాలు ఇక వుండకపోవొచ్చని, ఎవరికి వారే యమునా తీరే అన్నచందంగా అధికారంకోసం పోరాటం చేస్తారని భావిస్తున్నారు.

ఒంటరిగానే వైసిపి ...

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా విపక్షాలతో జట్టు కట్టాలని వైసిపి కి ప్రశాంత్ కిషోర్ వంటివారు గతంలోనే సలహా ఇచ్చారు. కానీ జగన్ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు ఇష్టపడి ఆ సలహాను పక్కన పెట్టారు. ఇదే రీతిలో జనసేన అధినేతకు వ్యూహకర్తలు సలహా ఇచ్చారు. జనసేనకు ఇప్పటికే వామపక్షాలు మద్దతు పలికాయి. లోక్ సత్తా లో జెడి లక్ష్మీనారాయణ చేరాక ఈ ప్రతిపాదన ఇంకోసారి తెరపైకి వచ్చింది. అయితే జనసేన కు ఈ పార్టీలు మద్దతుగా ఉన్నప్పటికీ వారితో ఇంకా ఎలాంటి చర్చలను పవన్ మొదలు పెట్టలేదు.

బాబుకు అవమానంతో ...

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు, పోటీ చేసి రెండు స్థానాలే సాధించడం హైదరాబాద్ లో ఘోరపరాభవం చెందిన టిడిపి ని ఇక వైసిపి వెంటాడటం ఖాయంగా కనిపిస్తుంది. టి ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయో లేదో శ్రీకాకుళం లో ప్రజా సంకల్ప యాత్రలో వున్న వైఎస్ జగన్ ఆముదాలవలస సభ వేదికగా చంద్రబాబు పై చెలరేగిపోయారు. చంద్రబాబు లెగ్ ఐరన్ లెగ్ అని కాంగ్రెస్ విజయావకాశాలు పై నీళ్లు చల్లి ఆ పార్టీని నీట ముంచారని ఈ అపవిత్ర పొత్తులను ప్రజలు తిరస్కరించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరో పక్క వైసిపి తాజామాజీ ఎంపీలు మొదలు అధికార ప్రతినిధులు అంతా టిడిపి అధినేత వైఖరిని టార్గెట్ చేస్తూ నిప్పులు చెరిగారు.

ఊపందుకోనున్న చేరికలు ...

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై క్లారిటీ రావడంతో అటు ఇటు గా వున్న వారిలో చాలామంది ఇప్పుడు విపక్ష పార్టీలకు జంప్ అవుతారని తెలుస్తుంది. తెలుగుదేశం కాంగ్రెస్ కాంబినేషన్ విజయవంతం అయితే అటు వైపు దూకుదామనుకున్న వారంతా ఇప్పుడు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. దీంతో బాటు ప్రజల నాడి పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టి టిడిపి పరాభవం నుంచి బయటపడి సరికొత్త వ్యూహాలతో వచ్చే ఏపీ ఎన్నికలను ఎదుర్కోవాలని మరోపక్క పసుపు పార్టీ సన్నాహాలు చేసేందుకు సిద్ధం అవుతుంది.

Similar News