జగన్ బయటకు పంపిన వారికి అండగా...?

Update: 2018-12-10 01:30 GMT

ప్ర‌కాశంలో జిల్లాలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇంచార్జిగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి, ముఖ్య‌ నాయ‌కుడు బాలినేని శ్రీనివాస‌రెడ్డిల మ‌ధ్య విభేదాలు మ‌రింత పెరుగుతున్నాయి. వైవీ ప‌ట్టుబ‌ట్టి ప‌క్క‌న పెట్టిన ప్ర‌కాశం జిల్లాలోని కొండ‌పి మాజీ ఇంచార్జి వ‌రికూటి అశోక్‌బాబును బాలినేని చేర‌దీశారు. త‌న‌ను ఇంచార్జిగా తొలగించ‌డాన్ని స‌వాలు చేస్తూ.. నిరాహార దీక్ష‌కు దిగిన అశోక్‌బాబును ప‌ట్టించుకోవ‌ద్ద‌ని ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన ఆదేశాల‌ను ప‌ట్టించుకోకుండా బాలినేని స్వ‌యంగా వెళ్లి వ‌రికూటిని నిరాహారదీక్ష విర‌మింప‌జేశారు. ఆయ‌న‌కు తాను అండ‌గా ఉంటాన‌ని కూడా ప్ర‌క‌టించారు. జ‌గ‌న్‌తో మాట్లాడి మంచి పొజిష‌న్ వ‌చ్చేలా చేస్తాన‌ని కూడా చెప్పాడు.

ఈక్వేషన్లు కలసి వస్తాయని....

ఇప్పుడు ఈ ప‌రిస్థితి మ‌రింత‌గా బాలినేని-వైవీల‌మ‌ధ్య మంట‌లు రాజేస్తోంది. కొండ‌పి ఇంచార్జిగా ఉన్న వ‌రికూటికి ప్ర‌జా ద‌ర‌ణ ఎక్కువే. ఒక్క ఎస్సీ వ‌ర్గ‌మే కాకుండా అన్ని వ‌ర్గాల్లోనూ మంచి పేరుంది. కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో 42 వేల క‌మ్మ సామాజికవ‌ర్గ ఓట‌ర్లు ఉన్నారు. అశోక్‌బాబు భార్య క‌మ్మ కావ‌డంతో ఇక్క‌డ ఈక్వేష‌న్ ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చింది. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి ఓడిన జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు పార్టీ మారాక స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ‌చ్చిన అశోక్‌బాబు పార్టీ కోసం బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే, ఇక్క‌డ జ‌గ‌న్ పాద‌యాత్ర నిర్వ‌హించిన స‌మ‌యంలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీల‌లో వైవీ ఫొటోలు లేకుండా కేవ‌లం జ‌గ‌న్‌, బాలినేని, వ‌రికూటి ఫొటోల‌తోనే ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. దీనిపై వైవీ ఆగ్ర‌హించి.. వ‌రికూటికి చెక్ చెప్పారు. ఆయ‌న స్థానంలో కొత్త స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా డాక్ట‌ర్ మాదాసు వెంక‌య్య వ‌చ్చారు. ఇది పైకి క‌నిపిస్తున్న విష‌యం.

పార్టీ బహిష్కరించినా....

అయితే, మ‌రో రెండు కార‌ణాలు బ‌లంగా వినిపిస్తున్నాయి. జిల్లామొత్తంపై బాలినేని ఆధిప‌త్యం సాగేలా చేస్తున్నార‌ని, ఆయ‌న త‌న న‌మ్మ‌క‌స్తుల‌కు ఇంచార్జి ప‌ద‌వులు ఇప్పించుకుంటున్నార‌ని వైవీ బ‌హిరంగంగానే గ‌తంలో ఆక్షేపించారు. తాను ఎంపీగా గెలిచాన‌ని జిల్లాలో త‌న మాటే నెగ్గాల‌న్న పంతంతో వైవి ఉన్నారు. ఇక తాజాగా కొండ‌పిలో స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా పార్టీ అధిష్టానం త‌ప్పించిన అశోక్‌బాబును పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. దీంతో ఆయ‌న నిరాహార‌దీక్షకు దిగారు.సుబ్బారెడ్డి త‌న‌ను డ‌బ్బుల కోసం వేధించార‌ని కూడా అశోక్‌బాబు ఆరోపించారు.

బాలినేని సాహసం....

తాను ఇప్ప‌టికే 5 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేశాన‌ని, డ‌బ్బులు ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని వ‌రికూటి ఖ‌రాకండీగా చెప్ప‌డంతోనే వైవీ ఇక్క‌డ మాదాసు వెంక‌య్య‌ను రంగంలోకిదింపారు. అయితే, ఇప్పుడు వ‌రికూటి నిరాహార దీక్ష‌కు దిగ‌డంతో.. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. బాలినేనిపై ఒత్తిడిపెరిగింది. ''నీకే విలువ లేక‌పోతే. మాకు ఎందుకు ఉంటుంది!'' అంటూ ఆయ‌న అనుచ‌రులు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏం జ‌రిగినా ఫ‌ర్వాలేదు! అనే ధీమాతో బాలినేని సాహ‌సం చేశార‌ని, వ‌రికూటికి మ‌ద్ద‌తుగా ఆయ‌న వెళ్లి.. దీక్ష విర‌మింప‌జేసి, నిమ్మ‌ర‌సం తాగించార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాలు ప్ర‌కాశం వైసీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఓ వైపు జ‌గ‌న్ మామ‌, మ‌రో వైపు జ‌గ‌న్ బాబాయ్ మ‌ధ్య జ‌రుగుతోన్న ఈ వార్‌లో జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Similar News