వైసీపీ విరుగుడు కనిపెట్టిందే....!

Update: 2018-06-22 02:00 GMT

వైసీపీ అధినేత జగన్ 2400 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. మరో 600 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచుతుండటంతో వైసీపీ కూడా అప్రమత్తమయింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ ఆమరణదీక్షకు దిగడం, ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే అంశంపై లేఖ రాయడంతో ఉక్కు ఫ్యాక్టరీ నినాదంతో ప్రజల్లో పట్టు సంపాదించుకోవాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. అయితే దీనికి విరుగుడుగా జగన్ కూడా కార్యక్రమాలను మొదలుపెట్టేశారు.

29న ఏపీ బంద్....

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఉక్కు ఫ్యాక్టరీని నాలుగేళ్ల నుంచి పట్టించుకోని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సమయానికి దాన్ని అందిపుచ్చుకోవాలని చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం కడప జిల్లా నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటుచేయాలని కోరుతూ ఈ నెల 23వతేదీన కడపలోనూ, 24వ తేదీన బద్వేల్ లోనూ, 25వ తేదీన రాజంపేటలో ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. 26వ తేదీన జమ్మలమడుగులో దీక్ష, 27వ తేదీన రహదారుల దిగ్బంధనం, 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.

పరిణామాలు మారడంతో...

వైఎస్ జగన్ పాదయాత్రలో ఉండగానే కేంద్ర, రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. అప్పటి వరకూ కలసి నడుస్తున్న బీజేపీ, టీడీపీలు విడిపోయాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా ఇచ్చిన వైసీపీని ఆ పార్టీ దగ్గరకు తీసుకుంటుందని భావించిన టీడీపీ కమలం పార్టీకి దూరమైంది. విభజన హామీలు అమలు చేయడం లేదంటూ బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి బీజేపీ, వైసీపీ కుమ్మక్కు రాజకీయాలంటూ టీడీపీ దుమ్మెత్తి పోస్తోంది. దీన్ని బయటపడేందుకు జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు.

ఎదురుదాడికి దిగాలని.....

అయితే టీడీపీ మాత్రం మోడీని, బీజేపీని తిట్టకుండా తమను తిట్టడమేంటని, కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించాల్సిన ప్రతిపక్షం కేంద్రానికి వత్తాసు పలుకుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు దుయ్యబడుతున్నారు. వీటన్నింటి నుంచి బయటపడటానికి ఇక కేంద్రంపై యుద్ధానికి రెడీ అయ్యారు వైసీపీ అధినేత. ఇకపై ఎక్కడికక్కడ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. నాలుగేళ్ల తర్వాత ప్రత్యేక హోదాతో పాటు విభజన సమస్యలు టీడీపీకి గుర్తుకొచ్చాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంలో వైసీపీ ఉంది. బీజేపీ నుంచే బయటకు వచ్చిన తర్వాతనే ఈ సమస్యలు గుర్తుకు వస్తున్నాయా? అంటూ ఎద్దేవా చేస్తోంది వైసీపీ.

Similar News