ఆ ఇద్దరిపైనే జగన్ టార్గెట్ !!

Update: 2018-12-09 01:30 GMT

తెల్లారిలేస్తే అయిన దానికీ కానిదానికి వైఎస్ జగన్ పై విమర్శలు చేసే సిక్కోలు మంత్రులిద్దరికీ చుక్కలు చూపించాలని జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా సీనియర్ మంత్రి, ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుపై మరింతగా ఫొకస్ పెట్టారు. బాబు కుడి భుజమైన కళాకు కాంతులు లేకుండా చేయడమే ధ్యేయంగా జగన్ పావులు కదుపుతున్నారు. ఏనుగు కుంభస్థలాన్ని కొడితే మొత్తం జిల్లావే చేతిలోకి వస్తుందన్న ఆలొచనతో జగన్ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర జోరుగా సాగుతోంది.

ఎచ్చెర్ల హెచ్చరిక...

ఇదిలా ఉండగా ఎచ్చెర్లలో జగన్ నిర్వహించిన మీటింగుకు భారీ స్పందన రావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరచింది. ఎచ్చెర్ల లో నిజానికి వైసీపీలో సరైన నాయకత్వం లేదు. ఇంచార్జి గొర్లే కిరణ్ కుమార్ ఓ వర్గంగా పార్టీలోని ఇతరులు వేరే వర్గంగా చలామణీ అవుతున్నారు. కిరణ్ కుమార్ తన కుటుంబానికే ప్రాధాన్యతను ఇస్తూ మిగిలిన వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దాంతో వైసీపీలో కుమ్ములాటలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఈ నేపధ్యంలో జగన్ ఎచ్చెర్ల మీటింగ్ జరిగింది. ఈ సభకు ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో జనం తరలిరావడం విశేషం.

కళాపై వ్యతిరేకత వల్లనేనా?

జగన్ సైతం షాక్ తినేలా సభ జరిగింది. ఇదంతా ఎచ్చెర ఎమ్మెల్యే, మంత్రి కిమిడి కళా వెంకట రావు పట్ల పేరుకుపోయిన వ్యతిరేకతకు నిదర్శనంగా కూడా భావిస్తున్నారు. ఎచ్చెర్లలో మంత్రి గత ఎన్నికల్లోనే స్వల్ప ఆధికత్యతతో బయటపడ్డారు. ఈసారి ప్రభుత్వ పాలన పట్ల వ్యతిరేకతకు తోడు పలు వర్గాలు దూరం కావడం కూడా గెలుపుపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. జగన్ సభకు హాజరైన జన సందోహం మంత్రికి హెచ్చరికగానే భావించాలని అంటున్నారు. ఇక సభలో జగన్ కళా వెంకటరావును టార్గెట్ చేసుకుని చేసిన విమర్శలకు జనం నుంచి వచ్చిన స్పందన బాగా ఉంది

టెక్కలిపైనా వ్యూహాలు.....

ఇక జగన్ పైన అసెంబ్లీలోనూ బయటా కూడా విమర్శలు చేస్తూ వస్తున్న కింజరపు అచ్చెమ్నాయుడు నియోజకవర్గం టెక్కలి. అక్కడ కూడా మంత్రి పని తీరు పై పెదవి విరుపు బాగా ఉంది. మంత్రి కేవలం, తన వారికే అంతా ధారాదత్తం చేస్తూ ప్రజలను పక్కన పెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాంతో మంత్రి సీటు టెక్కలి నుంచే సమర శంఖం పూరించడం ద్వారా జనాలను ఆకట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు. అచ్చెన్న పనితీరుపైన జగన్ భారీ ఎత్తున విరుచుకుపడతారని అంటున్నారు. ఈ ఇద్దరు మంత్రులు జిల్లాకు చేసిందేమొటో చెప్పాలని జగన్ నిలదీయనున్నారు. టెక్కలిలో ఇపుడు వైసీపీకి సానుకూల వాతావరణం కనిపిస్తోంది. అయితే ఇంచార్జుల పనితీరును సరిచూసుకుంటూ సమర్ధులను బరిలోకి దింపితే విజయం ఖాయం అంటున్నారు.

Similar News