ఇకనైనా నేర్చుకోండి.....!!

Update: 2018-12-11 03:30 GMT

అవును! ఎన్నిక‌లు ముగిసిన తెలంగాణా నుంచి ఏపీ నాయ‌కులు అటు అధికార‌ప‌క్షంలోని వారు, ఇటు ప్రతిప‌క్షంలోని వారు కూడా నేర్వాల్సిన పాఠాలు అనేకం ఉన్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక‌, అదేస‌మ‌యంలో ప్రజ‌లు కూడా చాలా పాఠాల‌నే నేర్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు. అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన తెలంగాణా ఎన్నిక‌లు చాలా విష‌యాల‌నే వెల్లడించాయి. అధికార పార్టీ ద‌ర్పం వీడాల్సినఅవ‌స‌రాన్ని నొక్కి చెప్పాయి. అంతా మేమే. ప్రజ‌ల‌కు ఏమీ తెలియ‌దు! అనే విష‌యాన్ని అధికార పార్టీలోని నేత‌లు త‌ప్పకుండా గ్రహించాలి. ఇది చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలంగాణా ప్రజ‌లు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు చెప్పిన పాఠం. ఈ నాలుగేళ్ల కాలంలో మీరు మాకు ఏం చేశారు? ఇక్క‌డ అభివృద్ది చేయ‌మంటే.. మీకు మీరు మీ వ్యాపారాలు అభివృద్ది చేసుకున్నారని నిలదీశారు.

నిలదీసిన ప్రజలు....

అదే స‌మ‌యంలో ఎన్నిక‌ల హామీల‌ను సైతం ప్ర‌స్తావించిన నియోజ‌క‌వ‌ర్గాలు, అవినీతిని ప్రశ్నించిన ప్రజ‌లు, నేత‌ల దౌర్జన్యాల‌ను , రౌడీ ప్రవ‌ర్తన‌ను ప్రశ్నించిన ప్రజ‌లు కూడా మ‌న‌కు ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణాలో ద‌ర్శన మిచ్చారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో సీన‌య‌ర్ నాయ‌కులు అనే విష‌యాన్ని సైతం ప‌క్కన పెట్టి.. నాయ‌కుల‌ను త‌మ గ్రామాల్లోకి రాకుండా అడ్డుక‌ట్ట వేశారు మీకు ఓటు ఎందుకు వేయాలో నాలుగు ముక్కల్లో చెప్పమ‌న్న నిర‌క్షరాస్యులు కూడా ఉన్నారు. అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంక‌టేశ్వర్లును ప్రతి రోజు గ్రామాల్లో ప్రజ‌లు ప్రచారంలో నిల‌దీశారు. ఇది ఆయ‌న‌కు నిత్యకృత్యమైంది. ఇక జూబ్లిహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను సైతం ప‌లువురు మ‌హిళ‌లు నిల‌దీశారు. తెలంగాణ‌లో చాలా చోట్ల ఇదే ప‌రిస్థితి.

వ్యతిరేక ఓటును మార్చుకోవడంలో....

జ‌న‌గామ‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డిని అయితే త‌మ హామీలు అమ‌లు చేయాల‌ని ఆయ‌న్ను నిల‌దీసి ఆయ‌న‌తో నోటు రాయించుకున్నారు. సో.. ఇలాంటి వ‌న్నీ ఏపీలోని అధికార టీడీపీ నాయ‌కులు చాలా జాగ్రత్తగా ప‌రిశీలించాలి. ఇక‌, విప‌క్షం విష‌యానికి వ‌చ్చినా.. ప్రభుత్వ వ్యతిరేక‌త‌ను ఓట్లు గా మార్చుకోవ‌డంలోను, ప్రజ‌లను న‌మ్మించి.. త‌మ‌వైపు తిప్పుకోవ‌డంలోను అక్కడి కాంగ్రెస్ స‌హా వివిధ ప‌క్షాల నాయ‌కులు విఫ‌ల‌మ‌య్యారు. ఈ విష‌యం తెలంగాణాలో స్పష్టంగా క‌నిపించింది. ప్రజ‌లు ఏం కోరుకుంటున్నారు.. అనే విష‌యాన్ని ప‌ట్టించుకో కుండా వెళ్లిన ఫ‌లితంగా ఇప్పుడు అక్కడి విప‌క్షం.. ఎన్నిక‌ల రిజ‌ల్ట్‌పైవిశ్వాసాన్ని ప్రక‌టించ‌లేని ప‌రిస్థితిని ఎదు ర్కొంటోంది.

ఇష్టారాజ్యంగా వెళితే....

మ‌రి ఇక్కడ కూడా ప్రధాన ప్రతిప‌క్షంగా ఉన్న వైసీపీ నాయ‌కులు ప్రజ‌ల్లోకి వెళ్లి.. వారి అభిరుచిని, వారు ఏం కోరుకుంటున్నారు? ఏం చేయాల‌నే విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన విధంగా రాజ‌కీయాలు చేసుకుంటూ పోతే.. ప్రయోజ‌నం ఉండ‌ద‌నేది స్పష్టంగా తెలంగాణా ఎన్నిక‌లు చెబుతున్న విష‌యం. ఇక‌, తెలంగాణా ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. మాట‌ల‌కు విలువ లేద‌ని, ప్రజ‌లు న‌మ్మడం లేద‌ని స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబు హైద‌రాబాద్‌లో చుట్టేశారు. సుడిగాలి ప‌ర్యట‌న చేశారు. సినీన‌టుడు, నంద‌మూరి హీరో బాల‌య్య కూడా సుడిగాలి ప‌ర్యట‌న చేసి.. తెలంగాణా యాస‌లో దుమ్మురేపారు. అయినా ప్రజ‌లు న‌మ్మలేదు. న‌మ్మి ఉంటే.. గ‌త ఎన్నిక‌ల‌క‌న్నా కూడా త‌క్కువ స్థాయిలో పోలింగ్ ఎందుకు న‌మోదైందో వారు చెప్పాలి. ఇక్కడ కూడా పవ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు ఇదే విష‌యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక‌, ఎన్నిక‌ల సంఘం నేర్వాల్సిన మ‌రో ప్రధాన విష‌యం.. ఓటు హ‌క్కు విష‌యంలో ప్రజ‌లు ఎంత అవ‌గాహ‌న క‌లిగి ఉన్నారో తెలంగాణా ఎన్నిక‌లు స్పష్టంగా చెప్పాయి. దాదాపు లక్షకు పైగా ఓట్లు గ‌ల్లంత‌వ‌డంపై అక్కడి ప్రజ‌లు ఎన్నిక‌ల సంఘాన్ని దుమ్మెత్తి పోశారు. ఆ ప‌రిస్థితి ఇక్కడ రాకుండా చ‌క్కదిద్దుకుంటేనే ఏపీలో ఎన్నిక‌ల‌కు ఓ అర్ధం. ప‌ర‌మార్ధం

Similar News