జగన్ నిర్ణయంపైనే అక్కడ గెలుపు.. !!

Update: 2018-12-13 01:30 GMT

విశాఖ జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలలో పెందుర్తి ఒకటి. ఇక్కడ నుంచి గెలిచిన వారు ఏపీ రాజకీయాలను శాసించారు. . మంత్రులుగా కూడా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. స్వర్గీయ ద్రోణం రాజు సత్యనారాయణ, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు వంటి వారు పెందుర్తి నుంచే నెగ్గారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కూడా గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ నేపధ్యంలో పెందుర్తి పైన అన్ని రాజకీయ పార్టీల చూపు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ సీటుని కైవసం చేసుకుందామని అటు టీడీపీ, ఇటు వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి. పెందుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటే గెలవడం సులువు అని వైసీపీ భావిస్తోంది. యువజన కాంగ్రెస్ నాయకునిగా ఉంటూ వైసీపీలోకి వచ్చిన అదీప్ రాజ్ పెందుర్తి వైసీపీ ఇంచార్జి గా వ్యవహరిస్తున్నారు. ఆయన తనకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమని భావిస్తున్నారు.

ప్రజా భరోసా యాత్ర....

నియోజకవర్గంలో అదీప్ రాజ్ ప్రజా భరోసా యాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దానికి జనంలోనూ మంచి స్పందన కనిపిస్తోంది. అంతే కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సొంత మండలం పరవాడలో కూడా అదీప్ రాజుకు జనం బ్రహ్మరధం పట్టడంతో టీడీపీలో బేజారు మొదలైంది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నేతగా అదీప్ రాజ్ వైసీపీలో ముందున్నారు. అర్ధ బలం, అంగ బలం కలిగిన అదీప్ సీనియర్ ఎమ్మెల్యేను డీ కొడుతున్నారు. పెందుర్తి సమస్యలపై గతంలో పాదయాత్ర కూడా చేపట్టిన అదీప్ రాజ్ వైసీపీని బాగానీ జనంలోకి తీసుకుపోగలిగారు.

టికెట్ ఇస్తారా...?

ఇదిలా ఉండగా జగన్ పాదయాత్రలో సైతం పెందుర్తికి జనం వెల్లువలా వచ్చారు. ఐతే జగన్ మారం అదీప్ కి టికెట్ ప్రకటించలేదు. దాంతో ఆయన వర్గం నిరాశ పడుతోంది. కాగా, పెందుర్తికి బయట నుంచి బలమైన క్యాండిడేట్ ని దింపుతారని ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన చొక్కాకుల వెంకట రావును పెందుర్తి నుంచి బరిలోకి దింపుతారని అంటున్నారు. ఆయన కనుక అభ్యర్ధి అయితే ఇక్కడ వైసీపీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి. అయితే అదీప్ రాజ్ కి టికెట్ ఇవ్వకపోతే వైసీపీకి ఇక్కడ ఓటమి ఖాయమని మాటా వినిపిస్తోంది. పార్టీ కోసం చాలకాలంగా పనిచేస్తున్న నేతను వదిలేసి బయట వారికి చివరి నిముషంలో టికెట్ ఇస్తే గెలుపు అసాధ్యం కావడమే కాదు, మరో మారు బండారు కి బంగారు పళ్ళెంలో పెట్టి ఎమ్మెలే సీటు అప్పగించినట్లవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Similar News