ఊరిస్తున్నాయి....వరించేదెవరిని...??

Update: 2018-12-05 17:30 GMT

ఛత్తీస్ ఘడ్ అన్ని పార్టీలనూ ఊరిస్తూనే ఉంది. పోలింగ్ ముగిసి పోయి ఇప్పటికి పక్షం రోజులు గడుస్తుండటంతో ఎవరి లెక్కల్లో వారు న్నారు. ఛత్తీస్ ఘడ్ గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ పోలింగ్ ముగిసిన వెంటనే గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ తప్ప మరే పార్టీకి చోటు లేదని, తిరిగి తామే అధికారంలోకి వస్తున్నామని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పేశారు. అయితే కొన్ని అంచనాల ప్రకారం గెలుపు అన్ని పార్టీలకూ దరిదాపుల్లోనే ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు.

కాంగ్రెస్ లో ధీమా.....

దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఛత్తీస్ ఘడ్ తమదేనంటూ ప్రకటించింది. నిజానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఉన్న నేతలు కూడా ఎన్నికలకు ముందు ఝలక్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక్కడ రాహుల్ గాంధీ పర్యటన ఆ పార్టీలో కొంత జోష్ తెచ్చిందనే చెప్పాలి. దాదాపు 72 శాతం ఓట్లు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీలో ఆశలు పెరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్ ఘడ్ లో 29 రిజర్వ్ డ్ స్థానాల్లో తమకే గెలుపు అవకాశాలుంటాయని అంచనా వేస్తోంది. అందుకోసమే కాంగ్రెస్ ఘంటా పధంగా తామే అధికారంలోకి వస్తున్నామని చెబుతోంది.

జోష్ మీద జోగీ.....

మరోవైపు జనతా ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ (జేసీసీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కూడా ఆశలు పెట్టుకున్నారు. హంగ్ వస్తే తానే ముఖ్యమంత్రి అవుతానని ధీమాగా ఉన్నారు. మాయావతి బహుజన్ సమాజ్ పార్టీతో కలసి పోటీ చేసిన అజిత్ జోగి తనకు 30 స్థానాలు ఖచ్చితంగా దక్కుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా గిరిజనులు ఉన్న రాష్ట్రంలో మాయావతి ప్రభావం ఉంటుందన్న లెక్కలు వేసుకుని ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎప్పుడు అధిష్టించుదామా? అని ఆతృతగా ఉన్నారు.

క్యాంప్ రాజకీయాలు.....

దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలున్నాయని తెలియడంతో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ రాజకీయాలు ప్రారంభించింది. తమ పార్టీ అభ్యర్థులను క్యాంప్ నకు తరలించే యోచనలో ఉన్నారు. అలాగే జోగి పార్టీ, మాయావతి పార్టీ కూడా తమ అభ్యర్థులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుని వారిని గట్టు దాటకుండా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కౌంటింగ్ కు మరో ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థులతో తరచూ సమావేశమవుతుండటం విశేషం. మొత్తం మీద ఛత్తీస్ ఘడ్ మాత్రం ఈసారి అన్ని పార్టీలనూ ఊరిస్తుందనే చెప్పాలి. ఫలితాల కోసం మరో ఐదు రోజులు వేచిచూడాల్సిందే.

Similar News