గేమ్ ఛేంజర్ ఎవరు....??

Update: 2018-12-06 17:30 GMT

కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. వరుస సంఘటనలు కర్ణాటకలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వ నేతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ నెల 10 నుంచి కర్ణాటక శాసనసభ సమావేశాలు బెళగావిలో ప్రారంభం కానున్నాయి. ఈ లోపే బీజేపీ గూటికి కొందరు కాంగ్రెస్ నేతలు చేరతారన్న ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్లుగానే బీజేపీ జాతీయ స్థాయి నేతల ప్రకటనలతో పాటు, మంత్రి సతీష్ జార్ఖిహోళి మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం కూడా పలు అనుమానాలుకు తావిచ్చే విధంగా ఉంది. శాసనసభ సమావేశాలు ముగిసే లోపే కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

మళ్లీ ఆకర్ష్ స్టార్టయిందా?

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ నేతలకు కంటమీద కునుకు లేకుండా చేస్తోంది. అంతర్గత విభేదాలతో కర్ణాటకలోని సంకీర్ణ సర్కార్ కూటమి కుప్ప కూలడం ఖాయమని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయినేతలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు కేంద్ర మంత్రులు కూడా ఇలాంటి ప్రకటనలు చేయడంతో బీజేపీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ముఖ్యనేతలు సమావేశమై పరిస్థితిపై చర్చలు జరిపారు.

మంత్రి వెంట వెళతారా?

ప్రస్తుత మంత్రి సతీష్ జార్ఖిహోళి సంకీర్ణ సర్కార్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన బెళగావి ప్రాంతంలో జరుగుతున్న పరిణామాల గురించే ఎక్కువ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే రిసార్ట్స్ ను పరిశీలించి రావడం కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంతేకాకుడా సతీష్ వెంట దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు బలంగా ప్రచారం జరుగుతోంది. వీరందరూ శాసనసభ సమావేశాలు ప్రారంభమయిన తర్వాత కమలం పార్టీలోకి జంప్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరుకాకపోవడాన్ని బట్టి చూస్తుంటే ఏదో జరుగుతుందనేది కాంగ్రెస్ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు.

విస్తరణ డేట్ ఫిక్స్.......

అందుకోసమే మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ నేతలు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 22న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, సమన్వయ సమితి అధ్యక్షుడు సిద్ధరామయ్య ప్రకటించారు. ఈనెల 22న ఖచ్చితంగా విస్తరణ ఉంటుందని చెప్పడం కూడా అసంతృప్తులకు మరోసారి ఆశలు కల్పించడంలో వ్యూహంలో భాగమేనంటున్నారు. శాసనసభ సమావేశాలు బూచిగా చూపుతున్నా, ఐదు రాష్ట్రాల ఎన్నికల బిజీలో రాహుల్ ఉండటంతోనే తాము మాట్లాడలేకపోయామని వివరణ ఇచ్చుకున్నారు. మరి అసంతృప్తులు విస్తరణ వరకూ వెయిట్ చేస్తారా? లేక ముందుగానే జంప్ చేస్తారా? అన్న టెన్షన్ సంకీర్ణ ప్రభుత్వంలోని జేడీఎస్ , కాంగ్రెస్ నేతల్లో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News