అందుకోసమేనా రాజుగారూ

అదేంటో ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ కంటే కూడా ఎక్కువగా విశాఖ భూ దందా గురించి బీజేపీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గట్టిగా పట్టుపట్టేవారు. అసెంబ్లీ [more]

Update: 2019-07-10 05:00 GMT

అదేంటో ప్రతిపక్షంలో ఉన్నపుడు వైసీపీ కంటే కూడా ఎక్కువగా విశాఖ భూ దందా గురించి బీజేపీకి చెందిన అప్పటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గట్టిగా పట్టుపట్టేవారు. అసెంబ్లీ బయటా లోపలా కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించేవారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాయడమే కాదు, మీడియా మీట్లు పెట్టి మరీ టీడీపీని ఉతికేసేవారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరులు ఈ భూ దందాలో ఉన్నారన్నది బీజేపీ రాజు గారి ప్రధాన ఆరోపణ. అయితే సిట్ విచారణ చేయించి తూతూ మంత్రగా నివేదిక తెప్పించి పక్కన పెట్టేసింది నాటి బాబు సర్కార్. ఇపుడు ప్రభుత్వం మారింది. జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్ని మళ్ళీ రాజు గారు ఇదే రకమైన డిమాండ్ చేస్తున్నారు. సిట్ నివేదికను బయటపెట్టాలని గట్టిగా కోరుతున్నారు.

టీడీపీ పాములే ఉన్నాయట…

సిట్ నివేదిక బయటకు వస్తే పసుపు తమ్ముళ్ళ బండారం బయట పడుతుందని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. మొత్తం భూ దందాలో ఉన్నవారు టీడీపీ వారేనని ఆయన చెబుతున్నారు. ఈ నివేదిక బయట పెట్టడానికి జగన్ సర్కార్ తో కూడా పోరాడుతామని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. పేదల భూములు దోచుకున్న వారంతా బయటకు రావాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన కోరుతున్నారు. నిజానికి సిట్ మీద రాజు గారు ఎందుకంత పంతంగా ఉన్నారంటే దానికి రాజ‌కీయ కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇపుడు టీడీపీ అధికారం కోల్పోయింది, అందులో ఉన్న పెద్ద నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు. వారిని అడ్డుకోవాలంటే సిట్ నివేదిక ఒక్కటే మార్గమని ఆ వైపు నుంచి రాజు గారు నరుక్కువస్తున్నారని అంటున్నారు. అవినీతి, కుంభకోణాలు ఉన్న వారిని బీజేపీలోకి తీసుకోబోమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నందున ఇలా ఇక్కడే పార్టీ గేట్లు వేయించాలని చూస్తున్నారు.

నివేదిక బయట పెడతామన్న బొత్స….

బీజేపీతో పాటు నాడు వైసీపీ కూడా విశాఖ బూ దందాలపై పోరాటం చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. గత ప్రభుత్వం అవినీతిని తాము వెలికి తీస్తామని, కబ్జాలు చేసినవారెవరైనా కూడా విడిచిపెట్టమని స్పష్టంగా చెప్పారు. సిట్ నివేదికను తొందరలోనే బహిర్గతం చేసి అందులో బాధ్యులుగా తేలిన వారిపైన చర్యలు ఉంటాయని కూడా ఆయన చెబుతున్నారు. తాము పారదర్శకమైన పాలన అందిస్తామని, ఇందులో ఎవరి డిమాండ్ మేరకో కాకుండా తాము అన్ని అంశాలను జనాలకు తెలియచేసే విధంగా వ్యవహరిస్తామని చెప్పుకొచ్చారు. మొత్తానికి బీజేపీ, వైసీపీ ల మధ్య సిట్ పటలు సాగుతూంటే సిట్ మంటల్లో పడి ఇబ్బందులు పడెదెవరోనని తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు. విష్ణుకుమార్ రాజు డిమాండ్ పై జగన్ సర్కార్ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News