ఇది ఎవరి ఫెయిల్యూర్... !!

Update: 2018-12-19 11:00 GMT

విశాఖ ప్రజలతో పాటు ఉత్తరాంధ్ర ప్రజానీకం దశాబ్దాల కాలం నాటి డిమాండ్ విశాఖ రైల్వే జోన్. తెలుగు ప్రాంతాలకు ప్రత్యేకంగా జోన్ ఉంటే మన ఉపాధి, మన సదుపాయాలు మెరుగుపడతాయని లక్షలాది మంది జనం ఆశపడిన డిమాండ్ ఇది. ఇంతటి సుదీర్ఘమైన డిమాండ్ ఇప్పటికీ నేరవేరకపోవడం వెనక రాజకీయ సంకల్పం గట్టిగా లేకపోవడమే కారణమని ప్రజల మాటగా ఉంది. 1970 దశకంలోనే తొలిసారిగా విశాఖ రైల్వే జోన్ డిమాండ్ వినిపించింది. అది 1990 దశకం నాటికి ఉద్యమ పంధాను సంతరించుకుంది. ఈ మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటికీ విశాఖకు జోన్ సాకారం కాలేదు.

బీజేపీ హామీ....

ఇదిలా ఉండగా 2014 ఎన్నికలకు ముందు బీజేపీ విశాఖ వాసులకు జోన్ ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చింది. ఈ కారణంగానే పెద్దగా బలం లేకపోయినా బీజేపీని నెత్తిన పెట్టుకుని జనం గెలిపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జోన్ తెస్తామని చెప్పిన కమలనాధులు ఆ మాటను పూర్తిగా పక్కన పెట్టేశారు. తొలినాళ్ళలో ఆర్భాటం చేసిన విశాఖ ఎంపీ తరువాత కాలంలో మౌనం దాల్చారు. నా పదవీకాలం పూర్తి అయ్యేలోగా జోన్ వస్తుందని చెప్పిన ఎంపీ హరిబాబు ఇపుడు ఆ ఊసే ఎత్తడంలేదు. ఇందుకు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వలేదని, ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా లేకుండా చేశారన్న ఆవేదన ఉంది. ఇక టీడీపీకి సానుకూలంగా ఉండే ఎంపీ ఆ పార్టీతో తెగతెంపులు కాగానే మళ్ళీ పోటీకి విముఖంగా ఉన్నారు. దాంతో గత ఏడాదిగా జోన్ గురించే ఆయన పట్టించుకోవడమేలేదని అంటున్నారు. అంటే పోటీ చేయాల్సివస్తేనే జోన్ గుర్తుకువస్తుందని, లేకపోతే పక్కన పడేస్తారని విమర్శలు వస్తున్నాయి.

హడావుడి చేసిన టీడీపీ....

విశాఖ జోన్ తామే తెచ్చి తీరుతామని చాన్నాళ్ళుగా హడావిడి చేస్తూ వచ్చిన టీడీపీ ఎన్నికల వేళ సద్దు చెయడంలేదు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు జోన్ కావాలంటూ ఒక రోజు దీక్ష ఆ మధ్యన చేశారు. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒక రాత్రి జాగార దీక్షలు కూడా జరిగాయి. అనాకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తన పుట్టిన రోజు వేళ జోన్ కోసం అంటూ కడుపు మాడ్చుకుని ఆందోళన చెపట్టారు ఇవన్నీ కూడా జనాలను ఆకట్టుకోవడానికి తప్పించి కచ్చితమైన కార్యాచరణ ఏదీ అధికార పార్టీ దగ్గర లేదని విపక్షాలు అంటున్నాయి

వైసీపీ అంతే....

ఇక ప్రతిపక్ష వైసీపీ నేతలు కూడా జోన్ కోసం గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పార్టీ నాయకులు కూడా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టి కొంత వరకూ కదలిక తెచ్చారు. అయితే తరువాత కాలంలో మాత్రం వారు కూడా మౌనమే దాల్చారు. ఇక వామపక్షాలు విశాఖ జోన్ కోరుతూ ఇంతకు ముందు పోరాటాలు చేసినా తాజాగా వారు సైతం స్తబ్దుగా ఉండిపోయారు. మొత్తానికి చూసుకుంటే ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని అంతా జోన్ విషయంలో కాడి వదిలేశారనే చెప్పాలి. ఇక ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. అప్పటిని మళ్ళీ జోన్ తెస్తామని ఓట్లు అడగడానికి మాత్రం పార్టీలు ముందుకు వస్తాయని ఇది మళ్లీ ఓట్ల కోసం వాడుకునే సాధనం అవుతుందని విశాఖ జనం మండిపడుతున్నారు. రాజ‌కీయపార్టీలకు చిత్తశుద్ధి ఉంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే రైల్వే జోన్ కోసం పట్టు పట్టి సాధిచాలని, విశాఖ బీజేపీ ఎంపీ కూడా తన మాట నిలబెట్టుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News