మంత్రిగారి అబ్బాయి స్వీటు సీటు... !!

Update: 2018-12-15 09:30 GMT

మంత్రులు కాదు కానీ వారి కుటుంబం హవా ఒక స్థాయిలో ఉండదని తమ్ముళ్ళు మదనపడుతున్నారు. వారసత్వం అందిపుచ్చుకుని చేస్తున్న పెత్తనం చాలక తమ సీట్లకు ఎసరు పెడుతున్నారని కూడా ఆవేదన చెందుతున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు రాజకీయ ఉత్సాహం చాలా ఎక్కువగానే ఉంది. ఆయన ఎంపీ కావాలనుకుంటున్నారు. దాంతో తనకు సీటు కంఫర్మ్ అయినట్లేనని భావిస్తూ అనకాపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యే అభ్యర్ధులను కూడా సెలెక్ట్ చేస్తున్నారు. దాంతో ఆ సీటుపై ఆశలు పెట్టుకున్న మిగిలిన వారంతా గొల్లుమంటున్నారు. గట్టిగా చెప్పడానికి మంత్రి కుమారుడు, కాదు అంటే తమ సీటు కిందకే నీళ్ళు వస్తాయేమోనని కంగారు పడుతూ కక్కలేక మింగలేక అన్నట్లుగా ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే ఉండగానే....

విశాఖ జిల్లాలో మాడుగుల అసెంబ్లీ సీటుకు టీడీపీలో పలువురు పోటీ పడుతున్నారు. ఇందులో 2009 ఎన్నికల్లో గెలిచి, 2014లో ఓడిపోయిన గవిరెడ్డి రామానాయుడు ముందు వరసలో ఉన్నారు. తనకు టికెట్ ఇస్తే ఈసారి తప్పకుండా గెలిచి చూపిస్తానని గవిరెడ్డి అంటున్నారు. ఆయన చాలాకాలంగా ఎన్నికల కోసం ప్రణాళికలు వేసుకుంటూ జనంలోకి వెళ్తున్నారు. అయితే ఇపుడు ఆయనకు పోటీగా మరో నేత రేసులోకి వచ్చారు. పైలా ప్రసాదరావు అనే ఓ ప్రవాస ఆంధ్రుడు మాడుగుల సీటుని కోరుకుంటున్నారు. ఆయన తన ఫౌండేషన్ ద్వారా మాడుగులలో సేవా కార్యక్రమాలు చేపడుతూ జనలకు చేరువ అయ్యేందుకు బాటలు వేసుకుంటున్నారు. దీంతో ఈ ఇద్దరికీ ఇపుడు సీటు కోసం యుధ్ధమే జరుగుతోంది. ఈ నేపధ్యంలో మంత్రి అయ్యన్న కుమారుడు విజయ్ జన్మ దిన వేడుకలు ఈ మధ్యన జరిగాయి. ఆ వేడుకల సందర్భంగా పైలా ప్రసాదరావు భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి హడావిడి చేశారు. అంతటితో ఆగకుండా విజయ్ ఫ్లెక్సీలు కూడా ఎక్కడికక్కడ పెట్టి మంత్రి కుటుంబం మద్దతు తనకే ఉందని ప్రచారం చేసుకున్న్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్గీయులలో కలవరం రేగుతోంది.

ఇటు వైపు చూస్తారా..?

మంత్రి కొడుకు ఫ్లెక్సీలతో ప్రచారం చేయడం ద్వారా పైలా ఓ విధంగా సక్సెస్ అయ్యారు. తనకు సీటు గ్యారంటీ అని ఆయన చెప్పుకున్నట్లైంది. అయితే అయనకు ఎంత వరకు మంత్రి కుటుంబం మద్దతు ఇస్తోందన్నది తేలకున్నా ఆయన ప్రచారం మాత్రం ఆ విధంగా సాగడంతో మాజీ ఎమ్మెల్యే వర్గంలో కొత్త బెంగ మొదలైంది. నిజంగా మంత్రి కుటుంబం పైలాకు మద్దతు ఇస్తోందా, లేక ఏకంగా మంత్రి కుమారుడే ఇక్కడ పోటీకి దిగుతారా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలలు ఉండడం, ఆశావహులు ఎక్కువగా ఉండడంతో ప్రతి చోటా ఈ విధంగానే పరిస్థితి ఉందని, మంత్రి, ఇతర పెద్ద నాయకుల పేర్లు చెప్పుకుని చాలా మంది ప్రచారం చేసుకుంటున్నారన్నమాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉన్నప్పటికీ మంత్రి కుమారుడు పేరుతో మాత్రం కొందరు నేతలు బాగా హల్ చల్ చేస్తున్నారు. అయితే నిజంగా మంత్రి కొడుకు పోటీకి దిగాలనుకుంటే మాత్రం ఆశావహులకు షాక్ తగిలినట్లే.

Similar News