దగ్గరవుతున్న విజయసాయి.... !!

Update: 2018-12-08 15:30 GMT

విశాఖ నగరంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ వి విజయసాయిరెడ్డి కన్ను పడిందా...? ఆయన రేపటి ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేస్తారా అన్న చర్చ మొదలైంది. విజయసాయిరెడ్డి రెండేళ్ల క్రితం నుంచి తన కార్యకలాపాలను విశాఖకు విస్తరించారు. ఇక్కడే ఒక క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ పనులతో పాటు ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం పైనా తగిన విధంగా కార్యాచరణ సిధ్ధం చేస్తూ ముందుకు సాగుతున్నారు. జగన్ సైతం విజయసాయిరెడ్డికే మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా విశాఖ జిల్లా పర్యవేక్షణ పూర్తిగా ఆయన చేతుల్లోనే పెట్టారు. అయితే విజయసాయిరెడ్డి, డిల్లీ, హైదరాబాద్ టూర్లతో ఎక్కువగా విశాఖలో గడపలేని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరింతగా దృష్టి సారించేందుకు విజయసాయిరెడ్డి తాజాగా నిర్ణయించుకున్నారని అంటున్నారు.

ఎంపీ ల్యాడ్స్ ఇక్కడే.....

విజయసాయిరెడ్డి కొద్ది కాలం క్రితమే విశాఖ జిల్లాను నోడల్ జిల్లాగా ఎంచుకున్నారు. తన రాజ్యసభ నిధులను ఈ జిల్లాకు ఖర్చు చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీని వల్ల పార్టీకి ఇక్కడ మంచి పేరు రావడంతో పాటు, జనాల్లోనూ అభివృధ్ధి కనిపిస్తుందని వైసీపీ భావించి ఆయన్ని ఇక్కడకి పంపించింది. ఇక ఈ ఏడాది విజయసాయిరెడ్డి దాదాపుగా 4.71 కోట్ల రూపాయల నిధులను తన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఖర్చు చేశారు. అందులో 3.18 కోట్ల రూపాయలు ఒక్క అర్బన్ జిల్లాలో అభివృధ్ధి పనుల కోసమే వెచ్చిండం విశేషం. ఇటీవల ఈ నిధులతో చేపట్టిన అభివృధ్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు కూడా. విశాఖ అభివృధ్ధికి తాను కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.

ఎంపీ క్యాడిడేట్ నా ....

విజయసాయిరెడ్డి ఈ మధ్యన విశాఖ నగరంలోని అన్ని వార్డుల్లో సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర కూడా చేపట్టారు. అనేక సందర్భాల్లో ధర్నాలు, ఆందోళనల్లో కూడా ఆయన పాలు పంచుకున్నారు. విశాఖ జనానికి ఆయన ఈ మధ్య కాలంలో బాగా దగ్గర అవుతున్నారు. పైగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయన ఆ ఇమేజ్ తో రేపటి రోజున విశాఖ ఎంపీ సీటుకు పోటీ పడితే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. విజయసాయిరెడ్డి కూడా విశాఖను నోడల్ జిల్లాగా ఎంచుకోవడం వెనక ఇదే విషయం ఉందని కూడా అంటున్నారు.

ఇప్పటికే అభ్యర్థిగా.....

అయితే ఇప్పటికే విశాఖ ఎంపీ సీటుకు రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణ పేరును వైసీపీ అధినాయకత్వం దాదాపుగా అనుకుంటున్నట్లుగా సమాచారం. కానీ గెలుపే ప్రధానం అని జగన్ భావిస్తున్న వేళ ఇపుడున్న ఏ పేర్లు కన్ ఫర్మ్ కావన్న మాట కూడా పార్టీలో ఉంది. పైగా ఎంవీవీ సత్యనారాయణ కంటే కూడా విజయసాయి బెస్ట్ క్యాండిడేట్ అవుతారని కూడా అంటున్నారు. మరి జగన్ మదిలో ఆ ఆలొచన ఉన్నదువల్లే విజయసాయిరెడ్డి పూర్వం కంటే కూడా చురుకుగా విశాఖలో పర్యటనలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

Similar News