విజయసాయి ఆపరేషన్ ‘‘ప్రకాశించేనా’’....??

Update: 2018-12-27 06:30 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అంటే ఎనలేని నమ్మకం. ఆయనకు అప్పగించిన మిషన్ ను పూర్తి చేసేంత వరకూ విజయసాయి రెడ్డి నిద్రపోరు. తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేసిన తర్వాతనే జగన్ కు రిజల్ట్ తో విజయసాయిరెడ్డి కన్పిస్తారన్నది పార్టీ వర్గాల్లో టాక్. అందుకే వైసీపీలో విజయసాయి రెడ్డి అంతకీలకంగా మారారు. ఆ జిల్లా ఈ జిల్లా కాదు ఎక్కడైనా ట్రబుల్ ఉంటే అక్కడ విజయసాయిరెడ్డిని జగన్ రంగంలోకి దింపుతారన్నది వాస్తవం. వంగవీటి రాధా విషయంలో కావచ్చు.... వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడంలో కాని, మానుగుంట మహీంధర్ రెడ్డి చేరిక విషయంలోనూ విజయసాయిరెడ్డి పాత్ర కీలకమనే చెప్పుకోవాలి.

విజయసాయికి బాధ్యతలు....

తాజాగా ప్రకాశం జిల్లాలో విజయసాయి రెడ్డికి పెద్ద బాధ్యతను జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ ను కొనసాగించేందుకు జగన్ విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. ప్రకాశం జిల్లాలో జగన్ కు సమీప బంధువులైన బాలినేని శ్రీనివాసులురెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు మాత్రమే ఇన్నాళ్లూ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడం... వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడటం వెనక కూడా వీరి వ్యూహలోపం, సమన్వయ లేమి ఉందని జగన్ గుర్తించారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ ఆధిక్యతను కనపర్చింది. అయితే బాలినేని, వైవీల కారణంగా పార్టీ దెబ్బతింటుందని గ్రహించిన జగన్ వారి నుంచి పగ్గాలు తీసుకునే యోచన చేస్తున్నారు.

ఆపరేషన్ స్టార్ట్....

విజయసాయి రెడ్డి ఆపరేషన్ ఇప్పటికే స్టార్టయిందంటున్నారు. ఆయన టార్గెట్ నలుగురు అధికార పార్టీ నేతలు. ఒకరు కరణం బలరాం, మరొకరు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. మాజీ మంత్రులు ముక్కు కాశిరెడ్డి, పాలేటి రామారావులుగా చెబుతున్నారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ను కూడా వైసీపీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీలోకి వస్తే ఆయనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమన్న సంకేతాలను బలంగా పంపింది. కరణం బలరాం పార్టీలో చేరితే ఆయనతో పాటు ఆయన కుమారుడు వెంకటేశ్ కు కూడా అసెంబ్లీ నియోజకవర్గ సీటును కేటాయిస్తామని గట్టిగా మాట ఇచ్చిందంటున్నారు.

ధీటైన నేతల కోసం....

ఇక కనిగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మార్చాలన్న యోచనలో ఉంది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును మార్చి ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డిని పార్టీలోకి చేర్చుకుని టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకు ప్రతిగా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు కాశిరెడ్డిని బరిలోకి దించాలని విజయసాయి రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఉగ్రకు ముక్కు ధీటైన అభ్యర్థి అని భావిస్తున్నారు ముక్కు కాశిరెడ్డి 2014 ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక చీరాల నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి పాలేటి రామారావును పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తుంది. ఆమంచి ఫస్ట్ ఆప్షన్. ఆయన రాకుంటే ఆమంచిని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద విజయసాయిరెడ్డి రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు కూడా అప్రమత్తమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా వారితో మాట్లాడేందుకు టైమ్ కూడా ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. మరి విజయసాయిరెడ్డి ప్రకాశం ఆపరేషన్ ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Similar News