అద్భుతం జరుగుతుందా...?

Update: 2018-12-05 16:30 GMT

రాజస్థాన్ ఎన్నికలు రోజురోజుకూ ఉత్కంఠను రేపుతున్నాయి. గెలుపు రెండు పార్టీల మధ్య దోబూచులాడుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలినుంచి రాజస్థాన్ కాంగ్రెస్ పరమవుతుందన్నది వివిధ సర్వేల అంచనా. అలాగే అధికారంలో ఉన్న కమలం పార్టీ కూడా దాదాపుగా రాజస్థాన్ పై ఆశలు వదలిసుకుంది. వసుంధర రాజే పై ఉన్న వ్యతిరేకతను పారదోలేందుకు ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రంగంలోకి దిగింది. తొలినాళ్లలో రాజేను వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్ తర్వాత క్షేత్రస్థాయిలో తమ దండును దించింది. దీంతో తొలినాళ్లలో కంటే కొంత కమలం పార్టీ పుంజుకుందన్న విశ్లేషణలు పోలింగ్ దగ్గరపడే కొద్దీ వెలువడుతున్నాయి.

సెంటిమెంట్ భయపెడుతున్నా.....

రాజస్థాన్ లో ఉన్న సెంటిమెంట్ కూడా కమలం పార్టీని తొలినుంచి భయపెడుతూనే ఉంది. ఇక్కడ ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి వచ్చే అవకాశం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఇదే అనుభవం రాజకీయ పార్టీలకు ఎదురవుతుంది. దీనికి తోడు ముఖ్యమంత్రి వసుంధర రాజే ఒంటెత్తుపోకడలు ఆ పార్టీకి పెద్ద నష్టాన్నే తెచ్చి పెట్టాయి. వసుంధర ను మార్చే సాహసం కూడా కమలం పార్టీ పెద్దలు చేయలేదన్నది ఆ పార్టీ నేతల నుంచే విన్పిస్తున్న మాట. వసుంధర చెప్పినట్లుగానే అధిష్టానం తలాడించడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తం అవుతుంది.

పోలింగ్ దగ్గరపడే కొద్దీ.....

మరోవైపు తొలినాళ్లలో ఊపు మీదున్న కాంగ్రెస్ పోలింగ్ దగ్గరపడే సమయంలో డీలా పడే పరిస్థితికి వచ్చింది. సంఘటితంగా పోరు చేయాల్సిన సమయంలో చేతులెత్తేసే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం కూడా ఆ పార్టీ అధిష్టానమే. ముఖ్యమంత్రి అభ్యర్థిపై క్లారిటీ లేకపోవడం వల్లనే ఇక్కడ సామాన్య ప్రజల్లో కొంత అయోమయం నెలకొనిందని అంటున్నారు. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లలో ఎవరో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే క్లారిటీ ఉండేదని సింహభాగం ప్రజల అభిప్రాయం. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇద్దరినీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రజల ముందుంచింది.

రెబల్స్ దెబ్బేస్తారా....?

అలాగే టిక్కెట్ల కేటాయింపు లో కూడా కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసిందంటున్నారు. ప్రధానంగా బికనర్, కిసాన్ ఘడ్ ప్రాంతాల్లో టిక్కెట్ల కేటాయింపులో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడంతో రెబల్స్ రంగంలోకి దిగారు. ఇది కమలం పార్టీకి కలసి వచ్చేదిగా చెబుతున్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు ఇక్కడ ప్రచార జోరును పెంచారు. రాహుల్ గాంధీ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి పార్టీ పటిష్టతకు కొంత కృషి చేశారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇక్కడ కమలం పార్టీ గెలిచే అవకాశాలు లేవన్నది విశ్లేషకులు నేటికీ చెబుతున్నారు. కానీ కమలం పార్టీ పెద్దలు మాత్రం ఎడారి రాష్ట్రంలో ఓట్ల కోసం తంటాలు పడుతున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Similar News