అంతా ఆమె వల్లే....!!

Update: 2018-12-11 17:30 GMT

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా తొలినుంచి బీజేపీ ఓటమి పాలయ్యే రాష్ట్రం ఏదంటే...ఠక్కున చెప్పేది రాజస్థాన్ మాత్రమే. రాజస్థాన్ లో తొలి నుంచి అంచనాలు అధికార పార్టీ బీజేపీకి వ్యతిరేకంగానే వస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వసుంధర రాజే పనితీరుపైనా, పాలనపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఆమెను మార్చే సాహసం చేయలేకపోయింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినప్పుడే వసుంధర రాజేను తప్పించి ఉంటే ఎన్నికల సమయానికి కమలం పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడేదన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.

ఒంటెత్తు పోకడలతో.....

రాజకుటుంబం నుంచి వచ్చిన వసుంధర రాజే తొలి నుంచి ఒంటెత్తు పోకడలను అవలంబిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యంలేని రాజే ప్రజలతో మమేకం అయ్యేందకు కనీస ప్రయత్నాలు కూడా ఈ ఐదేళ్లలో ఏమీ చేయలేదనే చెప్పాలి. ఎన్నికల చివరి అంకంలో ప్రజలవద్దకు యాత్ర రూపంలో వెళ్లినా అది సత్ఫలితాలివ్వలేదు. ఆమె సభలకు వచ్చిన జనాన్ని చూస్తేనే అది అర్థమవుతుంది. రాజే ఈ ఐదేళ్ల కాలంలో ఏ వర్గానికీ మేలు చేయలేదన్న అపప్రథను మూటగట్టుకున్నారు. ఆమె అనుకున్నదే చేశారు తప్ప ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకోలేదన్నది కాదనలేని వాస్తవం.

ఎన్ని ప్రయత్నాలు చేసినా.....

ఈనేపథ్యంలో చివరి సమయంలో అమిత్ షా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రైతులు వసుంధర రాజే పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ ఆగ్రహం మొత్తాన్ని ఓట్ల రూపంలో చూపించారు. రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆ వర్గం మొత్తం దూరమయిందనే చెప్పాలి. ఎన్నికల సందర్భంగా రైతు రుణ మాఫీ చేస్తానని చెప్పినా అన్నదాతలు పట్టించుకోలేదు. ఇక యువత, మధ్యతరగతి ప్రజలు కూడా రాజే పాలన పట్ల విసుగెత్తి హస్తం పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో వసుంధర రాజేకు పరాజయం తప్పలేదు.

కాంగ్రెస్ సమన్వయంతో.....

మరోవైపు ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఆచితూచి తొలినుంచి వ్యవహరించింది. ఎక్కడా తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. కాంగ్రెస్ నేతలు సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లు సమన్వయంతో పనిచేసి విజయం సాధించగలిగారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ వివాదాలకు తావులేకుండా చేసింది. సీఎం రేసులో ఉన్న సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ లను ఇద్దరినీ బరిలోకి దించడంతో ఎవరు ముఖ్యమంత్రి అనే అంశం కన్నా వసుంధర ను ఇంటికి పంపాలన్న నినాదమే ఎక్కువగా పనిచేసిందనే చెప్పాలి. మొత్తం మీద సంప్రదాయం ప్రకారం చూసినా రాజస్థాన్ లో ఒకసారి గెలిచిన పార్టీ మరొకసారి అధికారంలో వచ్చే ఛాన్స్ లేదు. అది మరోసారి రుజువయిందనే చెప్పాలి.

Similar News