బెట్టు చేస్తే మొదటికే మోసం...???

Update: 2018-12-18 06:30 GMT

బెజ‌వాడ రాజ‌కీయాల్లో తన‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సాధించిన వంగ‌వీటి రంగా కుమారుడు వంగ‌వీటి రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్తు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్న చందంగా మారిపోయింది. రాజ‌కీయంగా స్థిర‌త్వం సాధించ‌లేని ప‌రిస్థితిలో రాధా ఉండ‌డ‌మే ప్ర‌ధానంగా ఆయ‌న‌కు బెడిసి కొడుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. 2004లో ఒక్క‌సారి విజ‌యం సాధించిన రాధా.. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ళ్లీ విజ‌య తీరం చేర‌లేక పోతున్నారు. పైగారాజ‌కీయంగా ఆయ‌న వేస్తున్న అడుగులు కూడా వివాదానికి దారితీస్తున్నాయి. 2009లో కాంగ్రెస్‌ను వీడ‌డం ఆయ‌న చేసిన ప్ర‌ధాన పొర‌పాటుగా ఇప్ప‌టికీ ఆయ‌న అనుచ‌రులు చెబుతుంటారు. ఇక‌, వైసీపీలో చేరి కూడా త‌నకు బ‌లంలేని తూర్పు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని మ‌రీ 2014లో రాజీ ప‌డ్డారు.

చావో రేవో లాంటిది...

ఇక‌, ఇప్ప‌డు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితి వంగ‌వీటి ముందు ఉంది. ఇప్ప‌టికే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న రాధా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. ఇప్ప‌టికే రాజ‌కీయంగా సందిగ్ధ స్థితిలో ఉన్న రాధాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు చావోరేవో లాంటిది. అయితే, స్థానికంగా కేడ‌ర్‌ను బ‌లోపేతం చేసుకోవ‌డంలోకానీ, త‌మ వాక్ చాతుర్యంతో ప‌దిమందిని ఆక‌ట్టుకోవ‌డం లో కానీ ఆయ‌న వెనుక‌బ‌డి పోయారు. ప్ర‌ధానంగా ప్ర‌జా పోరాటాల‌ను ప‌క్క‌న పెడితే.. వంగ‌వీటి సినిమాను తీసిన రాంగోపాల్ వ‌ర్మ‌ను నిలువ‌రించ‌డంలోను (ఈ సినిమా వంగ‌వీటికి వ్య‌తిరేకంగా ఉంద‌న్న అభిప్రాయం తెలిసిందే ) , వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని తొల‌గించ‌కుండా ప్ర‌భుత్వాన్ని క‌ట్ట‌డి చేయ‌డంలోను.. దివంగ‌త ఐపీఎస్ అదికారి వేద వ్యాస్ పేరుతో ఏర్పాటైన భ‌వ‌నానికి ఆ పేరును మార్చాల‌నే డిమాండ్ ను సాకారం చేసుకోవ‌డంలోను కూడా రాధా ఘోరాతి ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, వైసీపీలో ఉండి కూడా త‌న తండ్రిని తీవ్రంగా విమ‌ర్శించిన పూనూరు గౌతంరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో జ‌గ‌న్‌పైనా ఒత్తిడి తేలేక‌పోయారు.

పవన్ పక్కన పెట్టారా...?

వెర‌సి.. రాధా ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగానే ఉంది. ఇక‌, ఇప్ప‌డు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచిపోటీ చేయాల‌ని అనుకున్నా రు. అయితే, ఇది సాధ్యం కాద‌ని వేరే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకోవాల‌ని జ‌గ‌న్ సూచించినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేదు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న జ‌న‌సేన‌లో కి చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసిందే. అయితే. ఇప్పుడు ఇది కూడా సాధ్యం కాద‌నే విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి ఏడాది కింద‌టే టీడీపీ ఆఫ‌ర్ ఇచ్చింది. పార్టీలో చేరితే రాజ్య‌స‌భ‌కు పంపుతామ‌ని హామీ ఇచ్చారు. అయితే, అప్ప‌ట్లో భీష్మించిన రాధా.. ఇప్పుడు అది కూడా ద‌క్క‌క పోయి.. మొత్తానికే చేటు తెచ్చుకున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలా ఎలా చూసినా.. రాధా ఫ్యూచ‌ర్ స్వ‌యంకృతంగా చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో కుంచించుకుపోతోంద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. రాధాకు అవ‌కాశం ఇవ్వ‌డాన్ని కొంద‌రు జ‌న‌సేన నాయ‌కులు త‌ప్పుబ‌ట్టార‌ని తాజాగా వెలుగు చూసింది. దీంతో ఈ ప్ర‌తిపాద‌న‌ను ప‌వ‌న్ ప‌క్క‌న పెట్టార‌ని అంటున్నారు. దీంతో అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాధా ఫ్యూచ‌ర్ ఏంటో ఎవ్వ‌రికి అర్థంకాని గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో ఉంది.

Similar News