తప్పుకుంటారా..? తప్పిస్తారా..?

Update: 2018-12-25 02:30 GMT

తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో పార్టీ పెద్దలు మునిగిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి, గెలుపోటములను విశ్లేషించడం, పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు గానూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ... రాష్ట్ర నేతలను ఢిల్లీకి పిలిచారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్లు ఢిల్లీ వెళ్లనున్నారు. అయితే, ఈ సమావేశంలో ఏం తేల్చనున్నారు... ఓటమికి బాధ్యత ఎవరు తీసుకోనున్నారు... పార్టీకి కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే దిశగా కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వారిని నియామకం చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, అధ్యక్ష బాధ్యత నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా తప్పుకునే అవకాశం కూడా ఉందంటున్నారు.

తప్పుకునే యోచనలో ఉత్తమ్

పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్నారు. ఆయనను మార్చాలని పలువురు నాయకులు ఎన్నిసార్లు అధిష్ఠానాన్ని కోరినా పట్టించుకోలేదు. రాష్ట్ర కాంగ్రెస్ ను నడిపించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన వ్యక్తిగా రాహుల్ భావించారు. దీంతో ఆయన సారథ్యంలోనే ఎన్నికలకు వెళ్లారు. పార్టీని గెలిపించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగానే కష్టపడ్డారు. అయితే, ఆయన కష్టం ఫలించక పార్టీ ఓటమి పాలయ్యింది. ఎన్నికలకు ముందు ఉత్తమ్ పలుమార్లు మాట్లాడుతూ... పార్టీ గెలిచినా ఓడినా తనదే బాధ్యత అని స్పష్టం చేశారు. దీంతో ఆయనే స్వచ్ఛందంగా పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రాహుల్ తో సమావేశంలో ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది. ఇక ఉత్తమ్ సీఎల్పీ పదవిని ఆశిస్తున్నందున పీసీసీ పదవిని వేరేవారికి వదిలేయవచ్చు. ఇటీవలి ఓటమితో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు. ఈ సమయంలో పాత నాయకత్వాన్ని కొనసాగించడం కంటే కొత్తవారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ క్యాడర్ లో జోష్ నింపవచ్చనే ఆలోచనలో కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని అంటున్నారు.

కొత్త నాయకత్వం అయితేనే...

ఇక, ఇన్నాళ్లుగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ కి ప్రధాన ప్రత్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై అనేక ఆరోపణలు, విమర్శలు చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి భారీ ఆధిక్యతను ప్రజలు ఇచ్చారంటే ఉత్తమ్ ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదని లెక్క. ఇటువంటి సమయంలో ఉత్తమ్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగితే ఆయన వాయిస్ కి ఎక్కువగా గుర్తింపు ఉండదు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవిని త్వరలోనే ఎవరైనా బలమైన నాయకుడికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. సామాజకవర్గ సమీకరణాలు, ఇతర అంశాలను బేరీజు వేసుకుని బలమైన నేతను ఈ పదవికి ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక, ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్ష పదవిని సుమారు 10 మంది వరకు నేతలు ఆశించినా ఇప్పుడు అంతగా పోటీ లేదు. పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పునరుత్తేజం నింపేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్ర పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Similar News