ఉండవల్లి కోరిక తీరనుందా ...?

Update: 2018-12-24 13:30 GMT

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ టిడిపి సర్కార్ ఏర్పడిన నాటినుంచి అనేక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. ఆయన లేవనెత్తిన అంశాలపై సర్కార్ శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేసేవారు. పోలవరం మొదలు కొని బాండ్ల జారీ వరకు ఉండవల్లి లేవనెత్తిన సందేహాలను ఏది నివృత్తి చేయలేదు టిడిపి ప్రభుత్వం. దాంతో ఉండవల్లి చెప్పింది వాస్తవం కాబట్టే వివరణ ఇచ్చేందుకు ఎవ్వరూ అధికారికంగా ముందుకు రావడం లేదన్న ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇది ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది.

ఆయనే కాదు ....

ఒక్క ఉండవల్లి మాత్రమే కాకుండా మాజీ సీఎస్ లుగా పనిచేసిన ఐవైఆర్ కృష్ణా రావు, అజయ్ కల్లాం వంటివారు గత కొంత కాలంగా ప్రాజెక్టులపైనా, ఎపి సర్కార్ చేస్తున్న ఖర్చులపైనా, అమరావతి నిర్మాణం పై పదేపదే ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. వీటన్నిటికీ సమాధానం చెప్పని సర్కార్ ఇప్పుడు ప్రభుత్వంలోని శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు సమాయత్తం అవుతుంది. విభాగాల వారీగా గత నాలుగున్నరేళ్ళల్లో చేసింది శ్వేతపత్రాల్లో ప్రకటించి వచ్చే ఎన్నికలకు ప్రజలకు వెళ్లాలన్నది టిడిపి వ్యూహం.

ఏ విధంగా.....

అయితే ఈ శ్వేతపత్రాల రూపకల్పన ఏవిధంగా వుండబోతుందన్న ఆసక్తి అన్ని వర్గాల్లో వుంది. ఒకే దెబ్బకు ఐదు పిట్టలను కొట్టాలన్న లెక్కతో సర్కార్ మాత్రం దీనిపై గట్టిగానే కసరత్తు సాగిస్తుందని అంటున్నారు. ఉండవల్లి, మాజీ సీఎస్ లతో బాటు బిజెపి, వైసిపి, జనసేన ల ప్రశ్నలకు ఇప్పుడు ప్రభుత్వం జవాబు చెబుతుందా ? లేక బూమ్ రాంగ్ అవుతుందా? అనేది చూడాల్సి ఉంది. తాము అనుకున్నదే తూతూ మంత్రం గా విడుదల చేస్తుందేమోనన్న అనుమానం లేకపోలేదు.

Similar News