"హాల్ మార్క్" తుమ్మలకు బెర్త్ గ్యారంటీ...?

Update: 2018-12-12 02:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రిగా మరోసారి కె.చంద్రశేఖర్ రావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. గురువారం ప్రమాణస్వీకారం ఉండవచ్చని చెబుతున్నారు. అయితే తొలిసారి తనతో సహా మరో ఐదుగురితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, మహిళలు ఉంటరాని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు జరిగే టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రులు తొలి విడత మంత్రులు ఎవరవరనేది తేలనుంది.

ఓటమి పాలు కావడంతో....

అయితే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఓటమి పాలయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తిరిగి మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడం, పార్టీకోసం ఆయన చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుని తుమ్మలకు త్వరలోనే మంత్రి పదవి దక్కనుందని చెబుతున్నారు. తొలి విడతలో లేకున్నా ఆ తర్వాత జరిగే మంత్రి వర్గ విస్తరణలో తుమ్మల ఉండటం ఖాయమని విశ్వసనీయంగా తెలుస్తోంది.

గత ఫార్ములానే.....

పాలేరు నియోజకవర్గంలో ఓటమిపాలయిన తుమ్మల నాగేశ్వరరావు 2014 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. వెంటనే ఆయనను ఎమ్మెల్సీగా చేసి కేసీఆర్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి తుమ్మల ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా అదే ఫార్ములాను కేసీఆర్ అవలంబిస్తారని తెలుస్తోంది. తుమ్మల కమ్మ సామాజిక వర్గానికి బలమైన నేత. అయితే అక్కడ నేతల మధ్య సమన్వయం లేకనే ఓటమి పాలయ్యారని కేసీఆర్ భావిస్తున్నారు.

సామాజిక వర్గం కోసమే....

కమ్మ సామాజికవర్గానికి హాల్ మార్క్ వంటి తుమ్మలను కేసీఆర్ వదులుకోరనేది పార్టీలో విన్పిస్తున్న టాక్. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉన్నా ఆ సామాజిక వర్గం నేతలను కేబినెట్ లోకి తీసుకోవడం తప్పనిసరి. టీఆర్ఎస్ లో గెలిచిన పువ్వాడ అజయ్, మాగంటి గోపీనాధ్ వంటి నేతలున్నా వారికి ఆ సామాజిక వర్గంపై పట్టులేదు. దీంతో కేబినెట్ లో తుమ్మలకు బెర్త్ గ్యారంటీ అన్న టాక్ గులాబీ పార్టీలో బలంగా విన్పిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News