అదే నమ్మకం...నమ్మకం..నమ్మకం...!!!

Update: 2018-12-18 05:30 GMT

ఏపీలో మ‌రో నాలుగు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. అటు అసెంబ్లీకి, ఇటు పార్ల‌మెంటుకు కూడా ఒకే సారి ఎన్నిక‌లు జ‌రగ‌నున్నాయి. అయితే, ఈ ఎన్నిక‌ల్లో త్రిముఖ పోటీ నెల‌కొంటుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీ, జ‌న‌సేన పార్టీలు ప్ర‌ధానంగా పోటీకి నిలుస్తున్నాయి. దీంతో ఏపీ ఎన్నిక‌లు తీవ్ర ఉత్కంఠ‌ను రేప‌నున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ముగ్గురూ మూడు బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు కావ‌డం, మూడు పార్టీల‌కూ భారీ ఎత్తున సానుభూతి ప‌రులు ఉండ‌డం, ప్ర‌జ‌ల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉండ‌డం, ముఖ్యంగా యూత్‌లోనూ ఈ పార్టీల‌కు ఆద‌ర‌ణ ఉండ‌డం వంటి కీల‌క అంశాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌లు చాలా ఆస‌క్తిక‌రంగాను, ఉత్కంఠ గాను మారాయి.

ముగ్గరూ.. ముగ్గురే.....

టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్ ముగ్గురూ కూడా బ‌ల‌మైన గ‌ళంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే వారు కావ‌డం మ‌రింత ఆస‌క్తిగా మారింది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ద‌క్షిణాది రాష్ట్రాల్లోనే ఏపీ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారాయి. దీనికి తోడు వ‌చ్చే ఏడాది ద‌క్షిణాదిలో అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్ర‌మే. దీంతో అంద‌రి క‌ళ్లూ ఏపీపైనే ఉన్నాయి. ఇక‌, విష‌యంలోకి వెళ్తే.. ఈ ముగ్గురు నాయ‌కుల‌నూ ప‌రిశీలిస్తే.. ఇద్ద‌రు నేత‌లు జ‌గ‌న్‌... ప‌వ‌న్‌లు సెంటిమెంట్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇక‌, అధికార పార్టీ టీడీపీ అధినేత సంక్షేమ నినాదంతో దూసుకుపోతోంది. ఇక‌, సెంటిమెంట్ ను బాగా న‌మ్ముకున్న జ‌గ‌న్‌.. త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. గ‌త ఏడాది నవంబరు నుంచే ఆయ‌న ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో ఆయ‌న పాద‌యాత్ర చేస్తున్నారు. ఆయ‌న ఎక్క‌డ ప్ర‌సంగించినా.. రాష్ట్రంలో రాజ‌న్న రాజ్యాన్ని తిరిగి తీసుకు వ‌స్తాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు.

పథకాలు గట్టెక్కిస్తాయని.....

ఇక‌, ప‌వ‌న్ తొలుత ప్ర‌శ్నిస్తానంటూ.. ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చినా.. ఇప్పుడు కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడ‌దా? అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. ఇక‌, చంద్ర‌బాబు.. త‌న ప్రభుత్వం పెద్దసంఖ్యలో ప్రజాసంక్షేమ పథకాలు అమలు చే స్తోంద‌ని చెబుతున్నారు. గతంలో ఇటువంటి పథకాలకు కొంత వ్యతిరేకంగా ఉన్నా ఈసారి మాత్రం పూర్తిస్థాయిలో వాటిని చేపట్టి నిర్వహిస్తున్నారు. రూ.1,000 పింఛను, నిరుద్యోగ భృతి, పండగ కానుకలు, బీసీ వర్గాలకు పనిముట్ల పంపిణీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ, రైతులకు రూ.లక్షన్నర వరకూ రుణ మాఫీ, డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష వరకూ సాయం, పేదలు చనిపోతే చంద్రన్న బీమా కింద రూ.5 లక్షల సాయం వంటివి బాబు త‌న‌కు ఓట్లు రాల్చుతాయ‌ని చెబుతున్నారు.

హోదా ఎవరికి మేలు చేస్తుందో?

ఇలా మొత్తంగా ఇద్ద‌రు నాయ‌కులు సెంటిమెంట్‌ను న‌మ్ముకొంటే.. బాబు మాత్రం సంక్షేమాన్ని న‌మ్ముకుని ముందుకు వెళ్తున్నారు. ఇక, అంద‌రికీ క‌లిసి వ‌స్తున్న మ‌రో అంశం ప్ర‌త్యేక హోదా! దీనిపై ఏపీ ప్ర‌జ‌లు భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఎటు మొగ్గుతారు? ఇప్ప‌టి వ‌ర‌కు ఇస్తున్న సంక్షేమానికి ఓటేస్తారా? లేక నూత‌న పాల‌న‌ను కోరుకుంటారా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News