ముగ్గురిలో ఎవరికి వారి సపోర్ట్....!!!

Update: 2018-12-18 12:30 GMT

ఎంత లేద‌న్నా.. ఏపీలో కుల రాజ‌కీయాలు జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మూడు వ‌ర్గాలుగా విడిపోయిన ఏపీలో రాజ‌కీయాలు మొత్తంగా మూడు వ‌ర్గాల చుట్టూతానే తిరుగుతోంది. అధికార పార్టీ క‌మ్మసామాజిక వ‌ర్గం కాగా, ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ రెడ్డి సామాజిక వ‌ర్గంగాను, ఇక‌, ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన కాపు వ‌ర్గంగాను ప్ర‌జ‌లు చూస్తున్నారు. ఆయా నాయకు లు కూడా ఆయా వ‌ర్గాల‌కు చెందిన వారికే ప్రాధాన్యం పెంచుతున్నాయి. వీటిపై ఎవ‌రి లెక్క‌లు ఎలా ఉన్నా ఇది నిజం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో జ‌రిగే ట్ర‌యాంగిల్ ఫైట్ నేప‌థ్యంలో ఏ వ‌ర్గానికి ఆ వ‌ర్గం ఆయా పార్టీ ల‌కు ఛాన్స్ ఇచ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక‌, ఇలాంటి ప‌రిణామంలో రాజ‌కీ యాల‌కు కేంద్ర‌మైన బెజ‌వాడ‌లో మ‌రింత ఆస‌క్తిక‌ర ఘ‌ట్టం వెలుగు చూసింది.

గొంతున్న నేతగా....

విజ‌య‌వాడలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాదాస్ప‌దంగా మారిన నియోజ‌క‌వ‌ర్గం బెజ‌వాడ సెంట్ర‌ల్‌. ఇక్క‌డ టీడీపీ నాయ‌కులు, ప్ర‌ముఖ వ్యాపారి బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాడు. అయితే.. త‌ర్వాత కాలంలో ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ప్ర‌జ‌ల‌ను చుల‌క‌న‌గా చూడ‌డం, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి ప‌ట్టుకు వెళ్ల‌క‌పోవ‌డం భూ క‌బ్జాలు లాంటి ఆరోప‌ణ‌లు బాగానే ఎదుర్కొన్నారు. అయినా కూడా చంద్ర‌బాబు బొండా స్వేచ్ఛ‌ను ఏ నాడూ అడ్డుకోలేదు. టీడీపీలో కాస్త గొంతున్న నాయ‌కుడుగా, ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొంద‌డంతో బొండాను బాబు ఎప్పుడూ.. ప్ర‌శ్నించ‌లేదు.

మళ్లీ బోండానే....

ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి మ‌ళ్లీ బొండానే రంగంలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇక‌, మ‌రో ప్ర‌ధాన పార్టీ వైసీపీ నుంచి బ్రాహ్మణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణుకు ఛాన్స్ ఇప్ప‌టికే ఖ‌రారైంది. ఇక‌, ఇదే టికెట్‌ను ఆశించిన కాపు వ‌ర్గానికి చెందిన వంగ‌వీటి రాధాకు వైసీపీ అధినేత జ‌గ‌న్ మొండి చేయి చూపించ‌డంతో ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుని, రేపో మాపో.. జ‌న‌సేన‌లోకి చేర‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే బెజ‌వాడ‌లో పోస్ట‌ర్లు కూడా ప్ర‌చురించారు. కాని పవన్ కల్యాణ్ రాధా చేరికపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనియోచనలో ఉన్నారు. ఇదే జరిగితే సెంట్ర‌ల్‌ నియోజకవర్గంలో ట్ర‌యాంగిల్ ఫైట్ అదిరిపోవ‌డం ఖాయం.

కాపు ఓటింగ్ ఎటు...?

ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఉన్న కాపు ఓటింగ్ ఎవ‌రికి ప‌డుతుంద‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎక్కువ భాగం రాధాకు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌ల్లో రాధాకు సింప‌తీ పెరిగింద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో 40 వేల పైచిలుకు ఉన్న బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గం ఓట‌ర్లు మ‌ల్లాది వైపే మొగ్గు చూపే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా ఈ ముగ్గురు నేత‌లు మూడు పార్టీల నుంచి బ‌రిలో ఉంటే బెజ‌వాడ సెంట్ర‌ల్ వార్ చాలా ఉత్కంఠ‌గా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

Similar News