అందరికీ టిక్కెట్లేనా...వారికి తప్ప...!!

Update: 2018-12-22 13:30 GMT

విశాఖ జిల్లాలో కేవలం ఇద్దరు తప్ప మిగిలిన వారంతా టీడీపీ ఎమ్మెల్యేలే. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలుపుకుని మొత్తం జిల్లాలో 15 మందికి గానూ 13 మంది అధికార పార్టీలోనే ఉన్నారు. వీరిలో వచ్చే ఎన్నికల్లో ఎందరికి టికెట్లు దక్కుతాయన్నది చాలకాలంగా నడుస్తున్న చర్చ. అయితే తాజాగా హై కమాండ్ నుంచి అందుతున్న సంకేతాలను బట్టి బాగా పూర్ అన్న రిజల్ట్ వస్తే తప్ప మిగిలిన వారందరికీ టికెట్ గ్యారంటీ అన్న చల్లని మాట వినిపిస్తోందట. దాంతో ప్రతి ఎమ్మెల్యే తమ్ముడూ మాకేం తక్కువ, మేము బాగానే పని చేస్తున్నాని సొంత సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ టికెట్ కి ఢోకా లేదని సంబరపడుతున్నారు.

ఎనిమిదో వంతేనట.....

తెలంగాణా ఎన్నికల ఫలితాలను చూసిన తరువాత టీడీపీ నాయకత్వ వైఖరిలో మార్పు వచ్చిందట. అదే ఇపుడు ఎమ్మెల్యేలకు శ్రీ రామరక్ష కాబోతోంది అంటున్నారు. గతంలో అనుకున్న ప్రకారం ఐతే సగానికి సగం మందికి జిల్లాలో టికెట్లు రావని భావించారు. ఇపుడు సిట్టింగులపై పూర్తిగా వ్యతిరేక ప్రభంజనం జనంలో ఉంటేనే టికెట్ కి కోత‌ పెట్టాలని అధినాయకత్వం డిసైడ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే విశాఖ జిల్లాలో కనాకష్టంగా ఒకరిద్దరికి మాత్రమే చెక్ పెట్టే అవకాశం ఉందంటున్నారు. అలా చూసుకుంటే అర్బన్ జిల్లాలో దాదాపుగా సిట్టింగులకు అందరికీ టికెట్లు ఖాయమన్న మాట వినిపిస్తోంది. దాంతో తమ్ముళ్ళు తెగ హుషారవుతున్నారు.

రూరల్లో తప్పదు...

రూరల్ జిల్లాలో మాత్రం ఒకరిద్దరికి టికెట్లు రాకపోవచ్చునని అంటున్నారు. అలా ఆలోచిస్తే పాయకరావుపేట నుంచి అనితకు టికెట్ డౌట్ అంటున్నారు. ఆమె గత ఎన్నికల్లోనే తక్కువ ఓట్లతో బయటపడ్డారు. దాంతో ఈ దఫా అక్కడ నుంచి బలమైన అభ్యర్ధిని బరిలో దింపాలనుకుంటున్నారు. అదే విధంగా చోడవరంలో కులబలం పెద్దగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యే రాజుని తప్పించవచ్చునని అంటున్నారు. మిగిలిన వారికి మాత్రం యధా ప్రకారం టికెట్లు వచ్చేస్తాయని చెబుతున్నారు. పాడేరులో వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి, అరకులో మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కి టికెట్లు కన్ ఫర్మ్ అంటున్నారు.

ఇవ్వకుంటే జారిపోతరనేనా?

మొత్తానికి చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రతిభ కన్నా వారికి టికెట్లు ఇవ్వకపోతే ఎక్కడ జారిపోతారో మరెక్కడ పార్టీకి చేటు తెస్తారో అన్న లెక్కలతోనే అధినాయత్వం టికెట్లు ఇచ్చేందుకు సిధ్ధపడుతున్నట్లుగా చెబుతున్నారు. మరో వైపు బలమైన వైసీపీ, జనసేన పార్టీలు కూడా పొంచి ఉన్న వైనం కూడా సిట్టింగులకు పెద్ద పీట వేయడానికి కారణమవుతోందిట. ఇక సిట్టింగులను తెలంగాణాలో కేసీయార్ తన ఇమేజ్ తో గెలిపించుకున్నట్లుగా చంద్రబాబు తన పాజిటివ్ ఓటింగుతో మళ్ళీ గెలిపించుకుంటారని అంటున్నారు. చూడాలి మరి.

Similar News