"మూడు" తో "మూడినట్లేనా....?

Update: 2018-12-15 16:30 GMT

కాంగ్రెస్ పార్టీ గెలవడం కూడా ఆ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టిందా? మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ లలో గెలిచి మంచి ఊపు మీదున్న హస్తం పార్టీకి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కష్టాలు తప్పవా? ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ ఇప్పటికీ ఉత్తర భారతంలో బలంగా ఉన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే దానిని రుజువు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ మూడు రాష్ట్రాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఇప్పుడు అనుకుంటున్నట్లు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు అంత సులువు కాదని చెబుతున్నారు.

దూరమవుతారా?

ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడం ఇష్టం లేని కొందరు విపక్ష నేతలు కూటమికి దూరమయ్యే అవకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా. దీంతో అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో మేధోమదనం ప్రారంభమయిందంటున్నారు. కాంగ్రెస్ బలం పెంచుకుంటే తమ రాష్ట్రాల్లో సొంత పార్టీ ఉనికికే ప్రమాదమని గ్రహించిన కొందరు నేతలు కూటమికి దూరం జరిగే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధానంగా కన్పిస్తున్నారు. మమత ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందన్న సంతోషం కంటే కాంగ్రెస్ గెలిచిందన్న ఆందోళనలోనే ఎక్కువగా ఉన్నారు.

కాంగ్రెస్ బలం పెరిగితే....

ఇటీవల బీజేపీయేతర కూటమికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 10వతేదీన ఢిల్లీలో సమావేశాన్ని కూడా నిర్వహించారు. సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతి తప్ప దాదాపు 15 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మరింత మంది దూరం జరిగే అవకాశముందని తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీయేతర కూటమిలో చేరేందుకు సుముఖత చూపడం లేదు. ఢిల్లీలో బీజేపీతో పాటు, కాంగ్రెస్ బలంగా మారితే తన పార్టీ ఉనికికే ప్రమాదమన్న ఆందోళనలో ఆయన ఉన్నారు.

మూడో ఫ్రంట్ కు.....

ఇక ఒడిశాముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ది కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ కాంగ్రెస్ అంతగా బలం లేకపోయినా మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడంతో బలపడుతుందేమోనన్న అనుమానంలో నవీన్ ఉన్నారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరం అని ప్రకటించేశారు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెసేతర కూటమికి మమత బెనర్జీ నడుంబిగించే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బీజేపీకి అంతకు మించి లాభం ఉండదంటున్నారు. మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఆనందమేనని, లోక్ సభ ఎన్నికల నాటికి కష్టాలు తప్పవని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News