బలం ఉన్నా... గెలుపు కష్టంగా మారిందే...!!!

Update: 2018-12-14 05:00 GMT

విశాఖ జిల్లాలో వైసిపి పరువు నిలిపింది ఏజెన్సీ ప్రాంతమే. 2014 ఎన్నికలలో ఏజెన్సీ నుంచి పాడేరు, అరకు అసెంబ్లీ సీట్లతో బాటు అరకు పార్లమెంట్ సీటు కూడా వైసీపీ బంపర్ మెజారిటితో గెలుచుకుంది. అనక జెండా ఎత్తేసి అరకు ఎంపీ కొత్తపల్లి గీత వైసీపీ నుంచి టిడిపి గూటికి చేరుకుంటే ఆ తరువాత అరకు ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా సైకిలేక్కేసారు. ఈ నేపధ్యంలో గిరిజనంలో అభిమానం ఉన్నా ఏజెన్సీ లో మాత్రం వైసీపికి గట్టి అభ్యర్ధులు లేకుండా పోయారు. వస్తారనుకున్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనలో చేరిపోయారు. ఇపుడు అరకు, పాడేరు, అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీటుకు కూడా బలమైన అభ్యర్ధుల కోసం వైసీపి నాయకత్వం వెతుకులాట మొదలెట్టింది.

బాలరాజు వ్యూహాలు.....

బాలరాజుకు ఏజెన్సీలో మంచి పట్టు ఉంది. ఆయన జనసేనలో చేరిన తరువాత ఊరకే కూర్చోకుండా నిత్యం అక్కడ పర్యటనలు చేస్తున్నారు. తన పలుకుబడిని ఉపయోగించి కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి కూడా కార్యకర్తలను చేర్పిస్తున్నారు. అయన మంత్రిగా పనిచేయడం వల్ల అందరితో ఉన్న పరిచయాలు ఇపుడు ఉపయోగపడుతున్నాయి. మరో వైపు పాడేరులో టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉన్నారు. ఆమె అధికార పార్టి కావడంతో నిధులు వెచ్చించి అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలో ఎటూ కాకుండా ఉండిపోయింది వైసీపీ మాత్రమేనని అంటున్నారు. వైసీపీకి ఇన్చార్జిగా శెట్టి ఫల్గుణ ఉన్నారు. అయితే ఆయన రాజకీయంగా అంత దూకుడు కాదు, పైగా కొత్త. ఆయన గిరిజన కార్పొరేషన్ లో ఉద్యోగిగా ఉంటూ వైసీపీలో చేరారు.

బలహీనపడుతున్న వైనం....

ఇపుడు ఆయనే పార్టికి పెద్ద దిక్కు అవుతున్నారు. ఆయనకు పార్టీ క్యాడర్ సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇది చాలదన్నట్లుగా వైసిపిలో లుకలుకలు బాగా ఉన్నాయి. ఇదే సీటును ఆశిస్తున్న మాజి ఎమ్మెల్యే దేముడు కుమార్తె భాగ్యలక్ష్మి రెండో వర్గం గా ఉంటున్నారు. ఇక వైసిపి లో ఉన్న క్యాడర్ లో ఎక్కువ భాగం గిడ్డి ఈశ్వరి తనతో పాటు తీసుకేల్లిపోయారు. ఆ విధంగా పార్టి బాగా బలహీనపడిపోయింది. ఒకరు సిటింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ మంత్రి, ఈ ఇద్దరు వ్యూహాలను తట్టుకుని పాడేరులో వైసిపి జెండాను ఎగరేసే చాతుర్యం ఫల్గుణుడికి ఉందా అన్నా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బలమైన చోట ఉనికి కోసం వైసిపి వెతుకులాడుతోంది. మైదాన ప్రాంతాలకు చెందిన నేతల రాజకీయం కారణంగానే వైసిపికి ఈ దుర్గతి పట్టిందని అంటున్నారు. పార్టీ జిల్లా వ్యవహారాలు చూసే విజయసాయిరెడ్డి ఎజెన్సిపై దృష్టి పెడితేనే తప్ప పార్టి గాడిలో పడదని అంటున్నారు.

Similar News