కాపీ...పేస్ట్ చేస్తే ముప్పేనా ...?

Update: 2018-12-20 11:00 GMT

రాజకీయాల్లో దూకుడు ఒక్కోసారి సూపర్ క్లిక్ అవుతుంది. తేడా కొడితే మడత కాజానే.దీనికి చక్కటి ఉదాహరణలు చెబుతారు రాజకీయ విశ్లేషకులు. ఇందులో ఒకటి 2004 లో అలిపిరి ఘటన తరువాత చంద్రబాబు సానుభూతి పవనాలు తనవైపు ఉన్నాయని భ్రమించి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఘోరంగా దెబ్బతినడం. మరొకటి తనపై విశ్వాసంతో 2009 లో వైఎస్ ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడమే కాకుండా 290 మంది అభ్యర్థులను నాలుగు స్థానాలు తప్ప ఒకేసారి ప్రకటించి ఎన్నికలకు దిగి ఘనవిజయం అందుకోవడం.

కొత్తభాష్యం చెప్పిన గులాబీ ...

తెలుగువారి రాజకీయాల్లో మొన్నటి ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం కొత్త చరిత్రే. ముందస్తు ఎన్నికలకు తెరతీయడమే కాదు అభ్యర్ధులందరిని వైఎస్ తరహా దాదాపుగా ఒకేసారి ప్రకటించి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. తాను అనుకున్నట్లే అపూర్వ విజయాన్ని నమోదు చేసి దేశంలో అందరి చూపు తమవైపు తిప్పుకోగలిగారు గులాబీ బాస్. ఇప్పుడు ఈ ఫార్ములా ఏపీలో అధికారం లో వున్న టిడిపి కాపీ పేస్ట్ చేయాలనే యోచనలో వుంది. ఇప్పటికే చంద్రబాబు ఈ విషయాన్ని ఇటీవల పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ కొత్త చర్చకు తెరలేపారు.

జంపింగ్ జపాంగ్ లే అసలు సమస్య ...?

టిడిపి ఈ ఫార్ములా అనుసరిస్తే మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అయితే వైసిపి నుంచి పార్టీ మారిన నియోజకవర్గ స్థానాలే సమస్య గా మారినట్లు టిడిపి అధిష్టానం అంచనా వేస్తుంది. ఇక్కడ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వారు జంపింగ్ లకు సహకారం అందించే ఛాన్స్ కనుచూపు మేరలో కానరావడం లేదు. ఇదే అధిష్టానానికి తలనొప్పిగా మారింది. వీటితో పాటు సిట్టింగ్ లందరికి కేసీఆర్ లా సీట్లు ఇస్తే పార్టీ శంకరగిరి మాన్యాలు పడుతుందని ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. 100 స్థానాల్లో సిట్టింగ్స్ కి సమస్య లేదు కానీ 60 నుంచి 70 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో పోటీ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. ఎవరికి టికెట్ దక్కినా రెబెల్స్ గా బరిలోకి దిగడం లేదా తెరవెనుక పార్టీ అభ్యర్థి ఓటమికి ప్రత్యర్థితో చేతులు కలపడం, ఛాన్స్ ఉంటే వైసిపి, జనసేనలకు మారిపోవడం చేస్తారన్న సమాచారం అధిష్టానానికి ఆందోళన కలిగిస్తుంది.

ఆ ఛాన్స్ పోయింది ...

ఇక 2026 వరకు నియోజకవర్గాల పెంపు లేదని రాజ్యసభలో సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సూటిగా చెప్పేసింది కేంద్రం. అలాంటి ఆశలు పెట్టుకోవద్దని స్పష్టం చేయడంతో కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయని పొలోమని పార్టీ తీర్ధం ఇచ్చిన నేతలకు ఎలా సముదాయించాలన్న కసరత్తు ఒక కొలిక్కి తమ్ముళ్లు తెచ్చారంటున్నారు. ఎమ్యెల్సీ, లేదా నామినేటెడ్ పదవులపై టికెట్ నిరాకరించిన వారికి ఎర ముందే వేయాలని వ్యూహం సిద్ధమైందని తెలుస్తుంది. దీనికి అంతా అంగీకరిస్తే ఎన్నికల ముందు లేదా నోటిఫికేషన్ రాగానే ఎలాంటి ఆలస్యం లేకుండా అభ్యర్ధులందరిని బాబు ప్రకటించడానికి సిద్ధం అవుతున్నట్లు పసుపు పార్టీలో టాక్.

వైసిపి, జనసేన కు హ్యాపీస్ ...

నియోజకవర్గాల పెంపు లేకపోతే ఆనంద పడేవి ఏపీలో రెండు పార్టీలు. అందులో ఒకటి వైసిపి కాగా మరొకటి జనసేన. ముఖ్యంగా వైసిపి తమ పార్టీ ని వీడి అధికార పార్టీలో చేరిన నియోజకవర్గాల్లో పరిస్థితి తమకు పూర్తిగా అనుకూలంగా ఉందని లెక్కలు వేసుకుంటుంది. పార్టీ మారిన వారికి టిడిపి స్థానిక నేతలనుంచి ఎలాంటి సహకారం లేకపోవడం తమ అభ్యర్ధికి అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడలు మొదలు పెట్టింది. ఇక జనసేన నిర్మాణం పూర్తిగా లేని పార్టీ కావడంతో పవన్ టిక్ పెట్టిన వారు తప్ప మిగిలినవారు రెబెల్స్ గా బరిలోకి దిగే ఛాన్స్ అతి తక్కువగా వుంది. దాంతో ఈ రెండు పార్టీలు బాబు అభ్యర్థులను ముందే ప్రకటించే నాటికి తమ తమ పార్టీలనుంచి బరిలో నిలిచే గెలుపు గుర్రాలను సిద్ధం చేసే పని లో బిజీ అయ్యాయి. చూడాలి ఈ ఎత్తులు పై ఎత్తుల్లో ఎవరిది పై చెయ్యి అవుతుందో మరి.

Similar News