బాబు ఎన్ని గిరికీలు కొట్టినా ఇక్కడ గెలవదట....!!!

Update: 2018-12-25 08:00 GMT

రాజ‌కీయాల్లో ఒకే పార్టీలో ఉన్న నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోతే.. చాలా ప్ర‌మాదం. ఎంత వైరం ఉన్నా.. ప్ర‌జల్లో మాత్రం స‌ఖ్య‌త‌గా ఉన్న‌ట్ట‌యినా క‌నిపించాలి! ఇది రాజ‌కీయ చ‌తుర‌త‌లో భాగం కూడా! మ‌రి ఈ విష‌యం తెలిసి కూడా ఆ త‌ల్లీకూతుళ్లు బ‌హిరంగంగానే క‌త్తులు నూరుతున్నారు. దీంతో తాము కూర్చున్న కొమ్మ‌ను తామే న‌రుక్కుంటున్నామ‌నే విష‌యాన్ని వారు మ‌రిచిపోతున్నారు. ఈ ప‌రిస్థితి వారితోనే పోవ‌డం లేదు. మొత్తం పార్టీకే ఈ జాడ్యం ప‌ట్టిస్తున్నారు. మ‌రి ఇంత‌కీ ఆ త‌ల్లీకూతుళ్లు ఎవ‌రు? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాయ‌కురాలు.. యామినీ బాల‌. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం అయిన శింగ‌న‌మ‌ల‌లో 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఇక్క‌డ నుంచి సాకే శైల‌జానాథ్ విజ‌యం సాధించారు.

విభజన కాకుంటే.....

నిజానికి ఇక్క‌డ రాష్ట్ర విభ‌జ‌న తాలూకూ వేడి లేక‌పోయి ఉంటే.. ఇక్క‌డ టీడీపీ గెలుపు సాధ్య‌మ‌య్యేది కాద‌ని ప్ర‌చారంలో ఉంది. దీనికి కార‌ణం ఏంటంటే 2004, 2009 ఎన్నిక‌ల్లో పీ శ‌మంత‌క‌మ‌ణి ప‌రాజ‌యం పాలు కావ‌డ‌మే. అయితే, 2014లో మాత్రం శ‌మంత‌క‌మణి కుమార్తెగా యామినీ బాల రంగంలోకి దిగారు. ఆమె ఇక్క‌డ వైసీపీ నాయ‌కురాలు జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిపై కేవ‌లం 4వేల ఓట్ల‌తోనే విజ‌యం సాధించారు. వాస్త‌వానికి ఇక్క‌డ కాంగ్రెస్ బ‌లం ఎక్కువ‌. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో కొంత‌మేర‌కు కాంగ్రెస్ వ్య‌తిరేక ఓటు బ్యాంకు టీడీపీకి స‌హ‌క‌రించింది. క‌ట్ చేస్తే.. నాలుగేళ్లు గ‌డిచిపోయాయి. ఇప్పుడు టీడీపీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. దీనికి కార‌ణం.. చంద్ర‌బాబు పాల‌నో.. ఆయ‌న చేస్తున్న కార్యక్ర‌మాలో కాదు.. త‌ల్లీకూతుళ్ల మ‌ధ్య ర‌చ్చ‌కెక్కుతున్న రాజ‌కీయ విభేదాలు.

తల్లీ కూతుళ్ల మధ్య వార్....

తాజాగా త‌న గెలుపు అనంత‌రం మంత్రిప‌ద‌వి ఖాయ‌మ‌ని అనుకున్నారు యామినీబాల‌. అయితే, స‌మీక‌ర‌ణ‌లు, అంచ‌నాలు స‌రిపోక‌.. ఆమెను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టి.. కేవ‌లం విప్‌తో స‌రిపెట్టారు. అయితే, మంత్రి ప‌ద‌విపై ఆశ‌చావ‌ని యామినీ బాల వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మంత్రి కావాల‌ని భావిస్తున్నారు. అయితే, ఆమె త‌ల్లి, ఎమ్మెల్సీ శ‌మంత‌క‌మ‌ణి.. మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ టికెట్‌ను త‌న కుమారుడికి ఇప్పించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే విష‌యాన్ని ఆమె స్థానిక ప‌త్రిక‌లు, స్థానిక మీడియాకు చేర‌వేశారు కూడా. అంతేకాదు... త‌న హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధి ఇప్పుడు లేద‌ని ఏకంగా ఆమె త‌న కూతురిపైనే విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతున్నారు.

సాకే రంగంలోకి దిగితే...

దీంతో ఇప్పుడు త‌ల్లీ కూతుళ్ల ల‌డాయి రోడ్డున ప‌డింది. ఇక‌, ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేసి విజ‌యం సాధించాల‌ని భావిస్తున్న మాజీ మంత్రి సాకే.. ఈ త‌ల్లీకూతుళ్ల వివాదాల‌కు మంచి క‌ల‌రింగ్ ఇస్తున్నారు. అభివృద్ధి లేని నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల్లీకూతుళ్ల వివాదాలు ఎందుకు? అని నిల‌దీస్తున్నారు. మొత్తంగా ఈప‌రిస్థితి చంద్ర‌బాబు దృష్టికి కూడా చేరింది. దీంతో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తంగా ఈ కుటుంబాన్ని త‌ప్పించాల‌ని భావిస్తున్నార‌ట‌! ఇంకోప‌క్క‌, వైసీపీ నాయ‌కురాలు.. జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇక అస‌లు మేట‌ర్ ఏంటంటే ఈ త‌ళ్లీకూతుళ్లను శింగ‌న‌మ‌ల రాజ‌కీయం నుంచి త‌ప్పించాల‌ని చంద్ర‌బాబు చూస్తుంటే మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ + టీడీపీ పొత్తు ఉంటే ఈ సీటును పొత్తులో భాగంగా మాజీ మంత్రి శైల‌జానాథ్‌కు ఇస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.మ‌రి ఎన్నిక‌ల వేళ శింగ‌న‌మ‌ల రాజ‌కీయం ఎలా మారుతుందో ? చూడాలి.

Similar News