టీడీపీ సీనియర్ నేత కఠిన నిర్ణయం...వైసీపీలోకేనా...!!

Update: 2018-12-18 13:30 GMT

విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఇపుడు రాజకీయ వర్గాలను బాగా ఆకట్టుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీకి టీడీపీ తరఫున ఏకంగా విశాఖ జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు దిగుతారని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఇక్కడ సమీకరణల్లో మార్పు వస్తుందని అంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు సీనియర్ నాయకుడు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా గెలిచిన చరిత్ర ఉంది. వచ్చే ఎన్నికల్లో అయనకు టికెట్ రాకపోవచ్చునని అంటున్నారు. వయో భారం వల్ల ఆయనే తప్పుకుని తన కుమారుడికి టికెట్ కోరుతున్నారు. అయితే ఇపుడు గంటా ని ఇక్కడ నుంచి రంగంలోకి దింపాలని టీడీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది. దీంతో వైసీపీలోనూ చర్చ నడుస్తోంది.

మంత్రితో ఢీ కొట్టేదెవరో...?

నెల్లిమర్ల నుంచి వచ్చీ ఎన్నికల్లో పోటీకి డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు రెడీ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఆరు వేల ఓట్ల తేడాతో పతివాడపై ఓడిపోయారు. అయితే ఆనాటి నుంచి నియోజకవర్గం విడవకుండా తిరుగుతున్నారు. ఆ సానుభూతితో పాటు, తండ్రి, జిల్లా రాజకీయాల్లో కురు వ్రుధ్ధుడు, మాజీ మంత్రి సాంబశివరాజు పేరు కూడా కలసి వస్తోంది. పాదయాత్రలో భాగంగా జగన్ ఇక్కడ నిర్వహించిన సభకు జనం పోటెత్తారు. అధికార పార్టీపై వ్యతిరేకత తీవ్రంగా ఉండడం, స్థానికంగా అభివృధ్ధి పనులు చేయకపోవడంతో జనం మార్పు కోరుతున్నారు.

గంటా వ్యూహం....

అయితే ఇక్కడ నుంచి పోటీకి గంటా రెడీ అయితే ఆ వ్యూహాలే వేరుగా ఉంటాయని అంటున్నారు. కాపు సామాజిక వర్గం మెజారిటీగా ఉన్న నెల్లిమర్లలో అదే సామాజికవర్గానికి చెందిన మంత్రి బరిలో ఉంటే పరిస్థితి సానుకూలం అవుతుందని అంటున్నారు. ఇక జిల్లా ఇంచార్జి మంత్రిగా అధికార బలం కూడా తోడు అవుతుందని భావిస్తున్నారు. అయితే పతివాడ ఇప్పటికే అధికార తెలుగుదేశంపై అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆయన చాలాకాలంగా మధన పడుతున్నారు.

వైసీపీలోకి మారతారా?

ఇక తన కుమారునికి కూడా సీటు ఇవ్వకుండా పోతే స్థానికుడైన ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాలి. అప్పట్లోనే ఆయన వైసీపీలోకి మారుతారని ప్రచారం జరిగింది. ఇక తనకు టీడీపీ అన్యాయం చేస్తే ఆయన కఠిన నిర్ణయానికి కూడా వెనుకాడరని అంటున్నారు. అపుడు మంత్రి గంటా పోటీ చేసిన ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉంటాయని కూడా అంటున్నారు. మొత్తానికి గంటా పోటీ చేస్తే ఢీ కొట్టేందుకు వైసీపీ కూడా వ్యూహాలను రచిస్తోంది.

Similar News