సీటు కోసం స్ట్రీట్ ఫైట్ తప్పదా..... !!

Update: 2018-12-21 13:30 GMT

విశాఖ జిల్లా టీడీపీలో సీట్ల కోసం ఫీట్లు ఓ రేంజిలో సాగుతున్నాయి. పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద ఎత్తున రెడీ కావడమే కాకుండా సామ దాన బేధ దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. దీంతో సిట్టింగులకు షాకులు తగులుతున్నాయి. రూరల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఇపుడు పార్టీలోని వారే టికెట్ కష్టాలు తెచ్చిపెడుతున్నారు. గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన వారే టికెట్ కోరుతున్నారు. దాంతో ఈ ఎమ్మెల్యే పరిస్తితి ఇరకాటంలో పడింది.

విశాఖ డైరీ చైర్మన్ హవా....

రూరల్ జిల్లా టీడీపీని విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు దశాబ్దాలుగా శాసిస్తున్నారు. అన్న నందమూరి తారక రామారావు టైం నుంచి పార్టీలో ఉన్న ఆయన ఏనాడు ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాలుపంచుకోకపోయినా రూరల్ జిల్లా టీడీపీ అభర్ధులకు వెన్ను దన్నుగా నిలుస్తూ వస్తున్నారు. అన్ని విధాలుగా వారి వెన్నంటి ఉంటూ విజయానికి బాటలు వేస్తున్నారు. దీంతో చాలా మందికి ఆయన గాడ్ ఫాదర్ లా మారిపోయారు. ఈ విధంగా 2014 ఎన్నికల్లో టీడీపీ ఎలమంచిలి నుంచి పోటీ చేసిన పంచకర్ల రమేష్ బాబు విజయానికి కూడా ఆయన పాటుపడ్డారు. ఇక ఆయన కుమారుడు, కుమార్తె సైతం టీడీపీ రాజకీయాల్లో ఈ మధ్య చురుకుగా పాలుపంచుకుంటున్నారు. కుమార్తె ఎలమంచిలి మునిసిపాలిటీ చైర్ పర్సన్ గా ఉంటే కుమారుడు పార్టీలో కీలక నాయకుడిగా ఉంటున్నారు. ఇపుడు కుమారుడు ఆనంద్ వచ్చే ఎన్నికల్లో ఎలమంచిలి నుంచి పోటీకి రెడీ అంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్లకు కష్టాలు మొదలైనట్లేనని అంటున్నారు

హైకమాండ్ సానుకూలమే....

పార్టీకి విశేష సేవలు అందిస్తూ వస్తున్న ఆడారి తులసీరావు కుటుంబానికి టికెట్ ఇవ్వాల్సివస్తే టీడీపీ హై కమాండ్ ఎపుడు సానుకూలంగానే ఉంటుందని అంటున్నారు. పైగా రూరల్ జిల్లా టీడీపీ అభ్యర్ధుల విజయాల వెనక ఆడారి తులసీరావు ఉన్న సంగతి కూడా తెలుసు. దీంతోఆయనకు న్యాయం చేసేందుకు అధినాయకత్వం సుముఖంగా ఉంటుందని అంటున్నారు. ఇక స్థానికుడు, బలమైన సామజిక వర్గానికి చెందిన ఆడారి కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా పార్టీని గెలిపించుకోవచ్చునని భావిస్తున్నారు.

వలస వచ్చిన నేత కావడంతో....

సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని, పైగా వలస వచ్చిన నాయకుడుగా విమర్శలు ఉన్నాయని అంటున్నారు. ఓ వైపు వైసీపీ, జనసేన పోటీ పడి సై అంటున్న తరుణంలో బలమైన అభర్ధిని బరిలో దించడానికే టీడీపీ ఓటు వేస్తుందని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు మాత్రం పంచకర్లకు చేదుగా మారుతున్నాయట. దీనికి బదులుగా తనకు విశాఖ సిటీలోనైనా ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాలని ఆయన కోరుతున్నారని కూడా అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

Similar News