వేస్ట్ అని ఒకరు..బెస్ట్ అని మరొకరు....??

Update: 2018-12-21 09:30 GMT

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ధోరణులను అవలంబిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య విభిన్న మైన వాదనలను విన్పిచండం కొత్తగా కన్పిస్తోంది. ఓటమి పాలయిన వాళ్లు చెప్పేదానికన్నా... త్వరలో ఎన్నికలను ఎదుర్కొనబోయే వాళ్లు తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత ప్రదర్శిస్తుండం విశేషంగా చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కూటమితో బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ కుదేలై పోయింది. ఇందుకు కారణాలను విశ్లేషించుకుని, కొందరైతే టీడీపీతో జట్టుకట్టడం వల్లనే తాము నష్టపోయామని బహిరంగంగానే చెబుతున్నారు.

టీడీపీ వల్లనేనంటూ.....

ప్రధానంగా తెలంగాణలో ఓటమిపాలయిన సీనియర్లు తప్పును టీడీపీపైకి నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా నలభైకి మించి స్థానాలు దక్కేవని, టీడీపీతో పోటీ చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటినేతలు బహిరంగంగా చెబుతున్నారు. ఒక అడుగు ముందుకేసి పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీతోపొత్తు వద్దనికూడా ఆయన చెబుతుండటం విశేషం. పొత్తు కారణంగానేనష్టపోయామని సీనియర్ నేతలు జానారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి లాంటి వాళ్లు అంతర్గత సమావేశాల్లో చెప్పేస్తున్నారు. వద్దు వద్దంటున్నా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని లెక్కలతో సహా వివరిస్తున్నారు. టీడీపీ ఓటు బ్యాంకు బదిలీ కాకపోవడానికి ఎవరు బాధ్యత వహిస్తారనికూడా వారు ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నేతలవల్లనే....

ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో మాత్రం విభిన్నమైన వాదన విన్పిస్తోంది. అక్కడ బలహీనమైన నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక సక్రమంగా జరగకపోవడం వల్లనే కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలయిందని, టీడీపీతో పొత్తు వల్ల కాదని చెప్పారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా అక్కడి నాయకులు కాపాడుకోలేకపోయారని మాజీ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దంపడుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు ఓటమిపాలయిందో అక్కడి నేతలు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని కొందరు ఏపీ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.

ఏపీ కాంగ్రెస్ మాత్రం....

దీన్ని బట్టి అర్థమవుతుందేంటంటే....వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తు కోసం తహతహలాడుతుందన్నది స్పష్టమవుతోంది. రాష్ట్ర విభజన కారణంగా పూర్తి స్థాయిలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలన్నా, ఈసారి శాసనసభలో కనీసం ప్రాతినిధ్యం లభించాలన్నా టీడీపీతో పొత్తుతో వెళ్లాలన్నదే అక్కడి కాంగ్రెస్ నేతల వాదనగా విన్పిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలను ఆంధ్రప్రదేశ్ కు అప్లయ్ చేయలేమని కూడా కొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద పక్క పక్కనే ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు టీడీపీ తో కలసి వెళ్లడంపై భిన్నమైన వాదనలను విన్పిస్తుండంతో ఇప్పుడు నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం చేతుల్లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి. పొత్తు విషయంలో చంద్రబాబు నిర్ణయం కూడా కీలకం కాబట్టి ఆయన అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ముందడగు వేయాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా ఉంది.

Similar News