హైకమాండ్ హైబీపీ తెప్పిస్తుందే.. ..??

Update: 2018-12-09 00:30 GMT

అదేంటో టీడీపీ తమ్ముళ్ళకు ఎంత పని చేసినా, మరెంత అంకిత భావంతో ఉన్నా టికెట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం హై కమాండ్ హై బీపీ తెప్పించేస్తోంది. చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నన్న ఉత్కంఠ ఉంది. ప్రతి సారీ పొత్తుల ఎత్తులతో ఉన్న సీట్లకు కూడా ఎసరు వస్తోంది. ఇంకోవైపు పార్టీ ముఖ్యమంటూ వేరే పార్టీల నుంచి చివరి నిముషంలో చేరికల వల్ల కూడా పార్టీలో ఉన్న వారే త్యాగాలు చేయాల్సివస్తోంది. గతసారి బీజేపీతో చాన్స్ కోల్పోయిన తమ్ముళ్ళకు ఇపుడు కాంగ్రెస్ పార్టీ భస్మాసుర హస్తం కాబోతోంది. దాంతో వారంతా బెంగటిల్లుతున్నారు.

జిల్లాకు మూడట....

జిల్లాకు మూడు ఎమ్మెల్యే సీట్లు కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది. అందుకోసం ఇప్పటి నుంచి జాబితాలను సైతం జిల్లా పార్టీ నాయకులు తయారు చేసి పీసీసీలకు పంపుతున్నారు. ఇక విశాఖ అర్బన్ జిల్లా విషయానికి వస్తే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, సీనియర్ నాయకునిగా ఉన్న ద్రోణం రాజు శ్రీనివాస్ కి టికెట్ ఖాయమన్న మాట గట్టిగా వినిపిస్తోంది. పొత్తుల్లో భాగంగా ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇస్తారని అంటున్నారు. అయితే ఎక్కడ ఇస్తారన్న దానిపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది.

ఆ మూడింట్లోనేనా...?

విశాఖ అర్బన్ జిల్లాలో మూడు సీట్లకు ఇపుడు ద్రోణం ఫీవర్ పట్టుకుంది. ఆయన రెండు మార్లు గెలిచిన దక్షిణ నియోజకవర్గం నుంచి సహజంగానే టికెట్ ను ఆశిస్తున్నారు. దాంతో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి బెంగ పట్టుకుంది. తనను పక్కన పెడతారేమోనని ఆయన కులం కార్డ్ ని బయటకు తీస్తున్నారు. మత్య్సకారుల కోటాలో ఆయన మళ్ళీ టికెట్ కోరుకుంటున్నారు. ఇక ఇదే అసెంబ్లీ నుంచి మైనారిటీ కోటాలో మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎ రహమాన్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు కొత్తగా మంత్రి అయిన ఫారూక్ తో మంచి రిలేషన్లు ఉన్నాయి. పైగా బాబు ఇపుడు మైనారిటీలకు టికెట్ కాదనలేని స్థితి.

ఆ మాజీ మంత్రికి షాకిస్తారా...

అందువల్ల ద్రోణం రాజు ని ఉత్తర నియోజకవర్గం పంపుతారని అంటున్నారు. అక్కడ చూసుకున్నా పార్టీలోకి వచ్చేందుకు రెడీ అంటున్న సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఉన్నారు. ఇక పార్టీలో చాలాకాలంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రియల్టర్ క్రిష్ణా రెడ్డి ఉన్నారు. మాజీ ఎంపీ సబ్బం హరి ఉన్నారు. వీరంతా పొత్తు ఇటు వైపు తిరుగుతుందేమోనని హడలిపోతున్నారు. అదే విధంగా ద్రోణం రాజు పెందుర్తి నుంచి అంతకు ముందు పోటీ చేసి ఓడిపోయారు. పైగా అది ఆయన సొంత ప్రాంతం. అక్కడ నుంచి ఈసారి పొత్తుల భాగంగా టికెట్ ఇస్తారని మరో ప్రచారం సాగుతోంది. దాంతో మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి బెదిరిపోతున్నారు. మొత్తానికి తమ్ముళ్ళంతా ద్రోణాస్రం తమ వైపు రాకుండా వేయి దేముళ్ళకు మొక్కుకుంటునారు. మరి బాబు నిర్ణయం, ద్రోణం రాజు ఆలొచనలు ఎలా ఉన్నాయో తెలిస్తేనే తప్ప అంతవరకూ తమ్ముళ్లకు ఈ టెన్షన్ తప్పెట్టు లేదు.

Similar News