టెన్షన్... ఒక రేంజ్ లో....!!

Update: 2018-12-23 13:30 GMT

తెలుగువారికి ప్రీతిపాత్రమైనది సంక్రాంతి పండుగ. అటువంటి పండుగ ఈసారి ఎన్నికల ఏడాదిలో వస్తోంది. దానికి తోడు అధినేత చంద్రబాబు ముందస్తుగా టికెట్లను ప్రకటిస్తామని భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అదీ సంక్రాంతి తరువాత టికెట్లకు సంబంధించిన తొలి జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు. దాంతో విశాఖ జిల్లాకు చెందిన తమ్ముళ్ళలో టెన్షన్ ఓ రేంజిలో పెరిగిపోతోంది. టికెట్ వస్తుందా లేక టిక్కు పెట్టేస్తారా అన్న ఆందోళన వారిని ఎటూ పాలుపోనీఅకుండా ఉంది.

హడలిపోతున్న ఎమ్మెల్యెలు...

విశాఖ జిల్లాలో ఇపుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. అలాగే దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా ఈ దఫా తమ జాతకం ఎలా ఉందోనని హడలిపోతున్నారు. టీడీపీ అంతర్గత సర్వేతో పాటు, బాబు స్వయంగా చేయించిన మరో సర్వే. ఇంటెలిజెన్స్ నిఘాల సర్వేలను వడబోసి మరీ బాబు గెలుపు గుర్రాలను డిసైడ్ చేస్తారట. దాంతో ఎవరికి టికెట్ వస్తుందన్నది సంక్రాంతి తరువాతే తేలనుంది. అందువల్ల ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకోలేని పరిస్థితి ఉంది.

సగానికి సగం పెండింగ్...

వివిధ కారణాల వల్ల జిల్లాలో సగం మంది టీడీపీ ఎమ్మెల్యేల టికెట్లు పెండింగులో పడతాయని టాక్ నడుస్తోంది. విశాఖ జిల్లాలో మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో కలుపుకుని పద మూడు మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. వీరిలో సగం మందికి సంక్రాంతి తరువాత విడుదల చెసే తొలి జాబితాలో టికెట్లు దక్కవన్న ప్రచారం సాగుతోంది. విశాఖ అర్బన్ జిల్లాలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టికెట్ పొత్తులో భాగంగా పక్కన పెడతారని అంటున్నారు. అలాగే అనేకమంది రేసులో ఉన్నందువల్ల ఉత్తర నియోజకవర్గం, వివాదాల్లో ఉన్నందువల్ల గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సీటు పెండింగ్ జాబితాలో ఉంటాయని అంటున్నారు.

తొలిజాబితాలో కన్పించనవి.....

ఇక రూరల్ జిల్లా విషయానికి వస్తే నర్శీపట్నంలో తన కుమారుడికి టికెట్ అడుగుతున్న మంత్రి అయ్యన్నపాత్రుడు తాను పోటీకి విముఖంగా ఉన్నారు. దాంతో ఆ సీటు, టీడీపీలో అసమ్మతి కారణంగా ఎలమంచిలి. ఎమ్మెల్యే పనితీరు బాగులేదని వస్తున్న కారణంగా అనకాపల్లి, పాయకరావుపేట, చోడవరం, మాడుగుల, పాడేరు సీట్లు తొలి జాబితాలో కనిపించవని అంటున్నారు. తొలి జాబితాలో ష్యూర్ గా వచ్చే పేర్లుగా మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి. మరో మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అరకు సీటు, విశాఖ తూర్పు, పశ్చిమ సీట్లు ఉంటాయని గట్టిగా వినిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే తొలి జాబితా వచ్చే వరకూ తమ్ముళ్ళకు నిద్ర పట్టేట్లు లేదంటున్నారు.

Similar News