సైకిల్ పరుగులు పెట్టే స్థానాలివేనా...??

Update: 2018-12-07 05:00 GMT

తెలంగాణలో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ మాత్రం జంకకుండా తెలంగాణలో ప్రచారాన్ని పూర్తి చేశారు. జై తెలంగాణ నినాదాన్ని నిర్భయంగా చేసిన చంద్రబాబు ఇప్పుడు గెలుపోటములపైనే దృష్టి పెట్టారు. పోటీ చేస్తున్న అభ్యర్థులతో రోజుకు మూడు సార్లు టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. తెలంగాణలో మొత్తం 13 స్థానాల్లోనే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పదిహేను స్థానాల్లో గెలిచినా కాంగ్రెస్ 13 స్థానాలు ఇస్తామన్నా అంగీకరించారు. భవిష్యత్ ను దృష్టిలోనే ఉంచుకున్న చంద్రబాబు తనకు సీట్లు ముఖ్యం కాదని ప్రజాకూటమి బలం చూపించాలన్నదే లక్ష్యమని ప్రతి సభలోనూ చెబుతూ వచ్చారు.

గ్రేటర్ హైదరాబాద్ లో.......

అయితే తెలంగాణలో టీడీపీ బరిలో నిలిచిన పదమూడు స్థానాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తుందన్న లెక్కలు టీడీపీ వేసుకుంటుంది. ముఖ్యంగా జంటనగరాల్లోనే ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశముందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటి నుంచి చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా ఎక్కువ మంది అభ్యర్థులను బరిలోకి దింపకుండా అసంతృప్తులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఏపీ నుంచి ప్రతి నియోజకవర్గానికి మంత్రులను, ఎమ్మెల్యేలను దించారు.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఇందుకోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి దానికి తొండెపు దశరధ జనార్థన్ ను ఇన్ ఛార్జిగా నియమించారు.

గ్రేటర్ లో నాలుగు....

కూకట్ పల్లి నియోజకవర్గాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు దాదాపు వారం రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అనేక రోడ్ షోలలో పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి , శేర్ లింగంపల్లి, సనత్ నగర్, రాజేంద్రనగర్, ఊప్పల్ నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ ఆరు నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు స్థానాలను కైవసం చేసుకుంటాయన్న ధీమాలో టీడీపీ నేతలున్నారు. ఇందులో కూకట్ పల్లి లో కొంత టఫ్ ఫైట్ ఉండగా సనత్ నగర్, ఉప్పల్, శేర్ లింగంపల్లి లో విజయం తమదేనన్న ధీమాలో ఉన్నారు. కూకట్ పల్లిని కూడా చివరి నిమిషంలో కైవసం చేసుకుంటామన్న విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మంలో మూడు....

ఇక ఖమ్మం జిల్లా టీడీపీ ఆశాజనకంగా కన్పిస్తుంది. అక్కడ పోటీ చేసిన సత్తుపల్లి, అశ్వారావుపేట, ఖమ్మం స్థానాలను సులువుగా గెలుచుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలుగా నియమించిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమవేశమైన చంద్రబాబు గెలుపు అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణాలో పదమూడు స్థానాల్లో ఏడింటిని ఖచ్చితంగా తమ ఖాతాలో పడతాయని, మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. మొత్తం మీద చంద్రబాబు చెమటోడ్చినందుకు ప్రజలు ఏరకమైన తీర్పు ఇస్తారన్నది వేచి చూడాల్సిందే.

Similar News