సేమ్ టెక్నిక్ ...మాణిక్యాలరావు తర్వాత...??

Update: 2018-12-25 09:30 GMT

బాబు ఒక ఆకు చదివితే మోదీ పది ఆకులు చదివినట్లుంది. చంద్రబాబు నాయుడు వ్యూహాలకు ధీటుగా బీజేపీ నేతలు కూడా పావులు కదుపుతున్నారు. వచ్చే నెల 6వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి గుంటూరులో బహిరంగసభలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మోసం చేశారని, విభజన హామీలు అమలు చేయలేదని, చట్టంలో ఉన్నవి కూడా మోదీ సర్కార్ కావాలనే ఏపీ ప్రజల వివిక్షతచూపుతుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. మోదీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందంటున్నారు. గుజరాత్ పై ఉన్న ప్రేమ ఆంధ్రప్రదేశ్ పై లేదంటున్నారు. అందుకే మోదీ ప్రధానమంత్రి పదవికి అనర్ముడంటూ ధర్మపోరాట దీక్షలతో బాబు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

చంద్రబాబు బీజేపీని.....

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గత కొద్దిరోజులుగా బీజేపీని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీకి కూడా అందుకు అనుగుణంగా పావులు కదుపుతుంది. తమ వ్యూహాలు తమకున్నాయంటోంది. ఇందుకు నియోజకవర్గాల అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఏపీలో గత నాలుగున్నరేళ్లుగా విపక్ష పార్టీలకు చెందిన నియోజకవర్గాలను అభివృద్ధి చేయలేదు. విపక్ష ఎమ్మెల్యేలకు కనీనం నియోజకవర్గ నిధులను కూడా మంజూరు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జికే నిధులు ఖర్చు చేసే పెత్తనం అప్పగించడాన్ని కూడా పలువురు మేధావులు తప్పుపడుతున్నారు.

నియోజకవర్గానికి నమ్మకద్రోహి అంటూ.....

ఈ నేపథ్యంలో తొలుత తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాణిక్యలరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇందుకు ఆయన చెప్పిన కారణాలేంటో తెలుసా...? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తాడేపల్లి గూడెం నియోజకవర్గానికి చంద్రబాబు 56 హామీలు ఇచ్చారట. అందులో కొన్నింటికి జీవోలు కూడా ఇచ్చారట. కానీ ఆ పనులేవీ జరగలేదు. చట్టం రూపంలో జీవోలు విడుదల చేసినా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడాన్ని ఆయన బాబును నమ్మకద్రోహిగా అభివర్ణిస్తున్నారు. అందుకోసమే రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

వరుస రాజీనామాలున్నాయంటూ....

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో గత నాలుగున్నరేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న విమర్శలు ఉన్నాయి. బీజేపీతో తెలుగుదేశం పార్టీ తెగదెంపులు చేసుకున్న తర్వాత ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో ఇప్పుడు బీజేపీ రివర్స్ లో బాబుపై బీజేపీ యుద్ధాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. తమ నియోజకవర్గాల అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు అసలైన ద్రోహి అంటూ బీజేపీ నేతలు రాజీనామాలకు దిగుతున్నారు. మాణిక్యాలరావు రాజీనామా తర్వాత మరి ఇదే బాటలో మరికొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో పయనిస్తారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మొత్తం మీద బాబు చేస్తున్న ధర్మపోరాటయుద్ధానికి ప్రతిగా నియోజకవర్గ స్థాయిలో పోరాటానికి దిగుతోంది బీజేపీ.

Similar News