ఇప్పట్లో బయటకు రానట్లేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి బలం ఉన్న జిలాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. 2014 ఎన్నికల్లో 15 స్థానాలకు 14 స్థానాల్లో టీడీపీ గెలిచింది. తాడేప‌ల్లిగూడెం [more]

Update: 2019-11-24 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి బలం ఉన్న జిలాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. 2014 ఎన్నికల్లో 15 స్థానాలకు 14 స్థానాల్లో టీడీపీ గెలిచింది. తాడేప‌ల్లిగూడెం సీటును బీజేపీకి ఇవ్వగా అక్కడ కూడా ఆ పార్టీ జెండాయే ఎగిరింది. టీడీపీ త‌ర‌పున బలమైన నేతలు ఉండటం, పార్టీకి వెన్నుద‌న్నుగా ఉండే సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉండటం, క్యాడర్ కూడా జిల్లాలో బలంగా ఉండటంతో ఇక్కడ టీడీపీ సత్తా చాటింది. అయితే 2019 ఎన్నికలకు వచ్చే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వర్గ విభేదాలతో జిల్లాలో ఉన్న నేతల్లో చాలా మంది టీడీపీకి దూరమయ్యారు. ఈ క్రమంలో దీనిని వైసీపీ బలంగానే వాడుకుంది. టీడీపీ తప్పుల మీద దృష్టి పెట్టి వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంది వైసీపీ.

పోలవరంపై పోరాటం…..

ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అక్కడ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఈ సమయంలో నాయకుల తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. బయటకు రావాల్సిన నేతలే రాకుండా టీడీపీ క్యాడర్ ని అయోమయంలో నెట్టేశారు. తణుకు, ఏలూరు, చింతలపూడి, కొవ్వూరు సహా పలు నియోజకవర్గాల్లో నేతలు బయటకు రావడం లేదు. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అయితే పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు ఆయ‌న ఇక దూర‌మైన‌ట్టే. కీల‌క‌మైన పోలవరం ప్రాజెక్ట్ ఉన్న జిల్లా కావడంతో ఇక్కడి నేతలు బయటకు రావాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ వారు మాత్రం బయటకు వచ్చి ఒక్క పోరాటం కూడా చేసిన సందర్భం కూడా లేదు.

నిమ్మల మినహా….

సంస్థాగ‌తంగా తిరుగులేని బ‌లం ఉన్న జిల్లాలో టీడీపీలో ఎందుకు ఉత్సాహం లేదంటే ఎక్కువగా వినపడే సమాధానం వర్గ విభేదాలే. రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు వాటితో పార్టీని నాశనం చేసిన నేతలు… ఇప్పుడు అవే విభేదాలతో క్యాడర్‌కు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో పాల‌కొల్లు నిమ్మల రామానాయుడు యాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం అటు అసెంబ్లీలోనూ, ఇటు బ‌య‌ట ఆయ‌న దూకుడే ఎక్కువుగా ఉంది. నిమ్మల మినహా మిగిలిన నేత‌లు ఎవరూ కూడా జిల్లాలో అంత యాక్టివ్‌గా లేరు.

బయటకు రాకపోవడంతో….

తణుకులో బలమైన నేతగా ఉన్న ఆరిమిల్లి రాధాకృష్ణ ఇసుక సహా పలు విషయాల్లో బయటకు వచ్చి ధైర్యంగా విమర్శలు చేయలేకపోయారు. తాడేపల్లిగూడెంలో ఓడిన ఈలి నాని అస‌లు పార్టీని ప‌ట్టించుకోవ‌డం లేదు. ముళ్లపూడి బాపిరాజు ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వక‌పోవ‌డంతో ఆయ‌న పార్టీని లైట్ తీస్కొంటోన్న ప‌రిస్థితి. ఇక చింత‌ల‌పూడిలో ఓడిన క‌ర్రా రాజారావు వ‌యోః భారంతో ఉన్నారు. కొవ్వూరులో ఓడిన మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత తిరిగి పాయ‌క‌రావుపేట‌కు వెళ్లిపోయారు. భీమ‌వ‌రంలో ఓడిన గంటా వియ్యంకుడు అంజిబాబు అస‌లు పార్టీతో సంబంధం లేద‌న్నట్టుగా ఉంటున్నారు. పోల‌వ‌రంలో ఓడిన బొరగం తిరుగుతున్నా ఆయ‌న స‌త్తా చాల‌డం లేదు. దీనితో ఇప్పుడు జిల్లా అంత‌టా పార్టీ క్యాడర్ లో కంగారు మొదలయింది. అసలు ఏం జరుగుతుంది పార్టీలో అనే ఆందోళన వారిలో నెల‌కొంది.

Tags:    

Similar News