టీడీపీకి అది ఊడిపోతుందా...??

Update: 2018-12-22 08:00 GMT

తెలుగుదేశం పార్టీ కొత్త చిక్కుల్లో పడింది. తెలంగాణలో ఇటీవల పోటీచేసిన ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ హోదా దక్కే అవకాశంలేదన్న ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు తెలుగుదేశం పార్టీకి ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓట్లు రాలేదని కొందరు తేల్చేశారు. దీంతో తెలుగుతమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు ఘోర ఓటమితో తలెత్తుకోలేని తెలుగుతమ్ముళ్లకు కొత్త చిక్కు వచ్చిపడింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అనుకున్న మేరకు ఓట్లను కూడా సాధించకపోవడంతో ఆ పార్టీ ఇరకాటంలో పడింది. ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు బయలుదేరాయి.

తెలంగాణ ఎన్నికల్లో....

ఇటీవల తెలంగాణ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, తెలంగాణ జనసమితితో కలసి మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మొత్తం 13 సానాల్లో పోటీ చేసింది. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోనే తెలుగుదేశం పార్టీ సీట్లు కోరింది. అయితే ఎన్నికల ఫలితాలు చూస్తే ఖమ్మం జిల్లాలో మాత్రమే కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగిలిన 11 స్థానాల్లో ఘోరంగా ఓటమి పాలయింది.

ఓట్ల శాతం భారీగా తగ్గి....

అయితే ఓటమి పాలయిన అభ్యర్థుల కూడా వచ్పిన ఓట్లను చూసి తెలుగుదేశం పార్టీ నేతలు కంగుతిన్నారు. ఇక్కడ వీరిపై పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు భారీ మెజారిటీ లభించింది. ఒక్క హైదరాబాద్ లోనే తీసుకుంటే కూకట్ పల్లి, శేర్ లింగంపల్లి, మలక్ పేట్, సనత్ నగర్, రాజేంద్ర నగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ముప్ఫయివేలకు పైగానే టీడీపీ అభ్యర్థుల మీద విజయం సాధించడం విశేషం. దీంతో తమకు పట్టున్న హైదరాబాద్ నగరంలోనే తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకుకు భారీగా గండిపడింది.

ఎన్నికల నిబంధనలు....

దీంతో ఎన్నికల సంఘం నిబంధనలపై పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీకి వచ్చిన ఓట్ల శాతంతో ప్రాంతీయంగా తెలుగుదేశం పార్టీకి గుర్తింపు ఉంటుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. పదమూడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అక్కడి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల శాతం కేవలం 3.7 శాతం మాత్రమే. అయితే ఎన్నికల నిబంధన ప్రకారం ప్రాంతీయ పార్టీ హోదా ఉండాలంటే 6.5 శాతం ఓట్లు రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో తెలంగాణ తెలుగుతమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారు. ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోవడంతో టీడీపీకి ఆ హోదా ఉంటుందా? ఊడుతుందా? అన్న ఉత్కంఠ వారిలో ఉంది. అయితే కొందరు మాత్రం ఎన్నికల నిబంధనలు టీడీపీకి వర్తించవంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ గా పోటీచేస్తేనే అది వర్తిస్తుందని, తాము కూటమిలో భాగంగా కొన్ని స్థానాల్లోనే పోటీ చేయడం వల్ల తమకు ఆనిబంధన పనిచేయదని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News